సాక్షి, అమరావతి : రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరిధిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే, పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపార సంస్థలు, కంపెనీల్లో తనిఖీ చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఉందని తీర్పునిచ్చింది. జీఎస్‌టీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలు, వ్యాపార సంస్థల్లో కూడా తనిఖీలు చేసే అధికారం కూడా ఈ విభాగానికి ఉందని తేల్చి చెప్పింది. ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం విజిలెన్స్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.
తమ కంపెనీలో తనిఖీలు చేసి, అమ్మకాల టర్నోవర్‌ను తగ్గించి చూపినట్లు పేర్కొంటూ విజిలెన్స్ అధికారులు జీఎస్‌టీ అధికారులకు అలర్ట్ నోట్ పంపడం జీఎస్‌టీ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కర్నూలుకు చెందిన సుధాకర్ ట్రేడర్స్ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా సుధాకర్ ట్రేడర్స్ వివరణ కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది. జీఎస్‌టీ చట్టం ప్రకారం చీఫ్ కమిషనర్ లేదా అతని నుంచి ఆథరైజేషన్ పొందిన అధికారికి మాత్రమే నోటీసులు జారీ చేసే అధికారం ఉందని తెలిపింది.
తిరిగి చీఫ్ కమిషనర్ లేదా అతని ఆథరైజేషన్ పొందిన అధికారులు సుధాకర్ ట్రేడర్స్‌కు నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకొని, ఆ తరువాత చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జ్యోతిర్మయి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
సమాచార మార్పిడిలో తప్పు లేదు
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలపై విచారణ, దర్యాప్తు చేయడం, ప్రభుత్వ ఆదాయ వనరులకు గండికొట్టే వారిపై చర్యలు తీసుకోవడం తదితర లక్ష్యాలతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటైందని తెలిపింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపాలిటీలు, జెడ్పీలు విజిలెన్స్ పరిధిలోకి వస్తాయంది. పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు రెండు శాఖల మధ్య సమాచార మార్పిడిలో ఎలాంటి తప్పూ లేదని స్పష్టం చేసింది.
అలెర్ట్ నోట్ ఆధారంగా నోటీసులివ్వడం చట్ట విరుద్ధం
ఐరన్, స్టీల్ వ్యాపారం చేసే సుధాకర్ ట్రేడర్స్‌లో విజిలెన్స్ అధికారులు 2022 సంవత్సరంలో తనిఖీలు చేశారు. అమ్మకాల టర్నోవర్‌ను తక్కువ చేసి చూపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్ నోట్ పంపారు. దీని ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ట్రేడర్స్‌కు నోటీసులు పంపి, వివరణ కోరారు. దీనిపై సంçÜ్థ యజమాని ఎస్.సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎంవీకే మూర్తి వాదనలు వినిపిస్తూ.. జీఎస్‌టీ చట్టం కింద రిజిస్టర్ అయిన డీలర్‌కు చెందిన సంస్థల్లో తనిఖీలు చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు లేదన్నారు.
అందువల్ల విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన నోటీసులు చెల్లవన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారి విషయంలో స్పందించే అధికారం విజిలెన్స్‌కు ఉందన్నారు. సుధాకర్ ట్రేడర్స్‌లో స్టాక్‌లో తేడాలున్నాయని, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేసినట్లు గుర్తించామన్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్ నోట్ పంపి, పన్ను ఎగవేతను అడ్డుకోవాలని కోరామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, రిటరŠన్స్‌లో లోపాలుంటే వాటిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసే అధికారం తమకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment