గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి కువైట్‌కు ఎయిరిండియా విమాన సర్విస్‌లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తిరుచినాపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన బోయింగ్ 737–800 విమానం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి కువైట్ వెళ్లింది.
ఈ విమానం కువైట్ నుంచి రాత్రి 8.35 గంటలకు ఇక్కడికి చేరుకుంది. ఈ విమానం ప్రతి బుధవారం తిరుచినాపల్లి నుంచి వయా గన్నవరం మీదుగా కువైట్‌కు వెళ్లి వస్తుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.
ప్రయాణికులకు ‘ఎయిరిండియా’ షాక్
ఈ విమాన సర్విస్‌లో కువైట్ వెళ్లాల్సిన 17 మందికి ఎయిరిండియా షాక్ ఇ చ్చింది. తొలుత ఈ సర్విస్‌కు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానం బయలుదేరే సమయం మధ్యాహ్నం 1.10 గంటలుగా తెలిపింది. తర్వాత విమానం బయలుదేరే సమయాన్ని ఆ సంస్థ ఉదయం 9.55 గంటలకు రీషెడ్యుల్ చేసింది. రిషెడ్యూల్ చేసిన విషయం తెలియకపోవడంతో వారంతా మధ్యాహ్నం 11 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
అప్పటికే విమానం కువైట్‌కు బయలుదేరిన విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. దీనిపై ఎయిరిండియా ప్రతినిధులను గట్టిగా ప్రశ్నించారు. కువైట్‌కు వెళ్లడానికి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే విమాన ప్రయాణ సమయం రీషెడ్యూల్ చేసిన విషయాన్ని సమాచారం రూపంలో సదరు ప్రయాణికుల సెలఫోన్లకు పంపినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.
అయితే సదరు ప్రయాణికులు సెల్ నంబర్లు బుకింగ్ ఏజెంట్లు, కువైట్ నంబర్లు ఇవ్వడం వల్ల సమాచార లోపం ఏర్పడిందన్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వచ్చే వారం కువైట్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment