ఆలయ మర్యాదలు, వివాదాలు వద్దు | Vishaka Sri Sarada Peetham Manager Reported To AP High Court | Sakshi
Sakshi News home page

ఆలయ మర్యాదలు, వివాదాలు వద్దు

Published Wed, Nov 18 2020 4:28 AM | Last Updated on Wed, Nov 18 2020 4:28 AM

Vishaka Sri Sarada Peetham Manager Reported To AP High Court - Sakshi

సాక్షి, అమరావతి/పెందుర్తి: విశాఖలోని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా పలు ఆలయాలు ఆలయ మర్యాదలు పాటించాలంటూ ఈ నెల 9న దేవదాయ కమిషనర్‌కు తాము రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పీఠం మేనేజర్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. శారదాపీఠాన్ని, స్వామీజీని వివాదాల్లోకి లాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శారదాపీఠం తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యనారాయణప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. దీన్ని రికార్డ్‌ చేసిన హైకోర్టు.. శారదాపీఠం రాసిన లేఖను పలు ఆలయాలకు పంపుతూ దేవదాయ కమిషనర్‌ జారీచేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 18న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఆలయ మర్యాదలు పాటించే విషయంలో దేవదాయశాఖ అదనపు కమిషనర్‌ ఈనెల 12న జారీచేసిన మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కాకుమాను లలితకుమార్‌ మరో ఇద్దరు సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. మంగళవారం విచారించాల్సిన కేసుల జాబితా దీపావళి ముందే సిద్ధమైనప్పటికీ, ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారించేందుకు హైకోర్టు ప్రత్యేకంగా ఓ అనుబంధ జాబితా తయారుచేసింది. దాన్లో ఈ వ్యాజ్యాన్ని మొదటì æకేసుగా చేర్చింది. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పక్కనపెట్టి, ఈ అనుబంధ జాబితాలోని కేసులకు హైకోర్టు ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. 2019 మే నుంచి చిన్న విషయాలను పెద్దవిగా చూపుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం, వాటిని న్యాయస్థానాలు విచారిస్తుండడం మొదలైందని ఏజీ శ్రీరాం చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. సన్యాసి అయిన స్వామీజీ జన్మదినం జరుపుకోవడం ఏమిటన్నారు..

సంప్రదాయం మేరకే పీఠం కోరిక
శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగాఆలయాల నుంచి స్వామీజీకి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలు అందజేయడం  2004 నుంచి ఆనవాయితీగా వస్తోందని విశాఖ శారదాïపీఠం ప్రతినిధులు  తెలిపారు. ఆ సంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని పీఠం కోరిందని పేర్కొన్నారు. 

నేడు స్వామీజీ జన్మదినోత్సవం
విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన మహోత్సవం బుధవారం జరగనుంది. పండగ వాతావరణంలో వేడుకలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement