వాట్సాప్ కాల్‌లో మాట్లాడుతున్న అభిజ్ఞ, స్వదేశానికి బయల్దేరేందుకు సిద్ధమైన సారిపల్లి తులసి
సాక్షి, పశ్చిమగోదావరి(తణుకు టౌన్): ఓ పక్క యుద్ధం.. బాంబుల మోత.. మరోపక్క విమానాల రద్దు.. వెనక్కి వెళ్లే అవకాశం లేక బంకర్‌లో ఇరుక్కుని తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మైనస్ 2 డిగ్రీల చలిలో, తాగునీరు సరిగా అందని పరిస్థితుల్లో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రెండు రోజులుగా కనీసం తాగునీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న తణుకు పట్టణానికి చెందిన తమలం అభిజ్ఞ వాట్సప్ కాల్‌లో తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం తణుకులోని తన తల్లిదండ్రులు జయకుమార్, సత్య భారతితో వాట్సప్ కాల్‌లో మాట్లాడుతూ తమను స్వదేశాలకు పంపించాలని, ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పాలని యూనివర్సిటీ వారిని కోరినా, వారు పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.
26న యుద్ధం జరగవచ్చని ముందుగా ప్రచారం జరిగిందని, ఈ నేపథ్యంలో 25 నాటికి విమానం టిక్కెట్ బుక్ చేయగా, 24నే రష్యా యుద్ధం ప్రారంభించిందని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎంబసీ సిబ్బంది వాహనాల ద్వారా ఉత్తర ప్రాంతాలకు రావాలని తమకు సూచిస్తున్నారని, అసలే యుద్ధం జరుగుతున్నవేళ విదేశీయులు అక్కడి వాహనాల్లో సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించడమంటే ఎలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.
చదవండి: (ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం టాస్క్‌ఫోర్స్)
ఆకలితో బంకర్లలోనే..
కార్కైవ్‌లోని మెట్రో రైల్వేస్టేషన్ బంకర్ వివిధ దేశాలకు చెందిన సుమారు 200 మంది ప్రజలతో కిక్కిరిసిపోయిందని, ఇక్కడ లైటింగ్ తప్ప ఫ్యాన్లు లేవని అభిజ్ఞ చెప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం స్టేషన్ పైకి వెళ్లాల్సి వస్తోందని, మరుగుదొడ్లకు కూడా భయం భయంగా బంకర్ పైకి వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం రాత్రి తనకు సమీపంలోనే సైనికుని మృతదేహం పైనుంచి పడిందని, దానిని చూసి చాలా భయపడ్డామని వివరించింది.
సురక్షితంగా రప్పిస్తాం
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ముఖ్యమంత్రి అన్ని ప్రయత్నాలూ చేపట్టారని, విద్యాశాఖ మంత్రి, ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు, విదేశీ రాయబార కార్యాలయాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.
విమానాల రద్దుతో ఆందోళన
తణుకు: తణుకు పట్టణానికి చెందిన సారిపల్లి తులసి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. ఆమె జపరంజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో రెండో ఏడాది ఎంబీబీఎస్ చదువుతోంది. ప్రస్తుతం ఆ దేశంపై రష్యా దాడుల నేపథ్యంలో తులసి బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. స్వదేశానికి రావడానికి శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ నుంచి టెకెట్ బుక్ చేసుకుంది. విమానాశ్రయానికి వచ్చేసరికి విమానం రాకపోకలు రద్దని చెప్పడంతో చేసేది లేక తిరిగి యూనివర్సిటీ హాస్టల్‌కు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తులసి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, పార్వతి తమ కుమార్తె కోసం తల్లడిల్లిపోతున్నారు.
అమ్మా.. నేను క్షేమం
ఆకివీడు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం మూడు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లిన ఆకివీడుకు చెందిన చుక్కా మోహన ప్రియ అక్కడ క్షేమంగా ఉన్నట్టు తల్లి విజయకు ఫోన్ ద్వారా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment