ఏపీలో మహిళా ఓటర్లే అధికం
ప్రస్తుతం ఏపీలో పురుష,మహిళా ఓటర్ల రేషియో 1:1.02
భవిష్యత్‌లో 1:1.06కు పెరిగే అవకాశం
ఏపీలో 2014లో ఓటు వేయని మహిళలు 83 లక్షలు.. 2019లో 41 లక్షలు
2024 ఎన్నికల్లో మహిళలు ఎక్కువ శాతం ఓటు వేస్తే ఫలితాల్లో గణనీయ మార్పు
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ 68 కోట్లకు చేరవచ్చని అంచనా..ఇందులో మహిళా ఓటర్లు 33 కోట్లు
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, గోవా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మహిళలదే ప్రధాన భూమిక అని నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంగా మహిళా ఓటర్లు ఎలా నిర్ణయాత్మకంగా మారుతున్నారనే అంశంపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుత సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది.
ప్రస్తుత ఎన్నికల్లో కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, సిక్కిం రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగి ఫలితాలను నిర్ణయిస్తారని నివేదిక పేర్కొంది.
మహిళా ఓటర్లలో చైతన్యం
ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో 83 లక్షల మంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని, 2019 ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాని మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 41 లక్షలకు తగ్గిపోయిందని, మహిళలు ఓటింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారనడానికి ఇదే సంకేతమని స్పష్టం చేసింది. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, తద్వారా ఫలితాలు గణనీయంగా మారిపోతాయని అంచనా వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జెండర్ రేషియో పెరుగుతోందని, లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఎన్నికల్లో పురుష, మహిళ ఓటర్ల రేషియో 1:1.02 ఉండగా భవిష్యత్‌లో 1:1.06కు పెరుగుతుందని వెల్లడించింది. గత ఓటింగ్ శాతాలు, మార్పులను విశ్లేíÙంచడం ద్వారా 2024లో పోలింగ్ 68 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 కోట్లు మహిళా ఓటర్లే ఉంటారని, ఇది 49 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ రేటు ప్రకారం 2029 నాటికి పోలింగ్ 73 కోట్లకు చేరుతుందని, ఇందులో 37 కోట్లు మహిళా ఓటర్లు ఉంటారని అంచనా వేసింది.
2047 నాటికి దేశంలో 115 కోట్ల మంది ఓటర్లుగా నమోదు కావచ్చని, ఓటింగ్‌లో 92 కోట్ల మంది పాల్గొంటారని నివేదిక తెలిపింది. 2047లో అత్యధికంగా మహిళా ఓటర్లు 50.6 కోట్ల మంది పాల్గొననుండగా పురుష ఓటర్లు 41.1 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల పోలింగ్ 67.01 శాతం ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ 67.18 శాతం ఉందని పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో అదనంగా 13 కోట్ల మంది మహిళలు ఓటు వేయవచ్చని, ఇది గేమ్ చేంజర్‌గా మారవచ్చని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment