అత్యున్నత విద్యతోనే మహిళా సాధికారత | Womens empowerment with higher education | Sakshi
Sakshi News home page

అత్యున్నత విద్యతోనే మహిళా సాధికారత

Published Thu, Aug 26 2021 5:09 AM | Last Updated on Thu, Aug 26 2021 5:09 AM

Womens empowerment with higher education - Sakshi

రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ , మాట్లాడుతున్న విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): అత్యున్నత విద్యా ప్రమాణాలు అందించడం ద్వారానే మహిళా సాధికారికత సాధ్యమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. జాతీయ విద్యా విధానంతో మన విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం నిర్వహించిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 18వ స్నాతకోత్సవంలో విజయవాడ నుంచి ఆయన వెబినార్‌ ద్వారా పాల్గొన్నారు. విద్యావేత్తలు, సమాజం మధ్య అవగాహనతోనే భవిష్యత్‌ సవాళ్లను అధిగమించగలమన్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయబద్ధమైన విద్యాబోధన విధానం స్థానంలో ఆధునిక ఆన్‌లైన్‌ విద్యాబోధనకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందన్నారు. ఉన్నత విద్యా సంస్థలు విజ్ఞానం, నైపుణ్యం, పారిశ్రామిక అనుసంధానంపై ప్రధానంగా దృష్టి సారించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వీసీ డి.జమున, చిత్తూరు ఎమ్మెల్యే ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పోపూరి లలితకుమారి(ఓల్గా)కి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, మరో 3,054 మంది యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ డిగ్రీలను అందుకున్నారు. 

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు 
ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేసే ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. స్నాతకోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ విద్యా సంస్థలకు ఫీజు రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ నిర్ణయించిన ఫీజులను వర్తింపజేస్తూ జీవో నంబర్‌ 53, 54 విడుదల చేసినట్టు చెప్పారు. నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని తెలిపారు.

95 శాతం మంది ఉపాధ్యాయులు వ్యాక్సిన్‌ వేసుకున్నట్టు చెప్పారు. చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పాఠశాలల్లో అక్కడక్కడా కోవిడ్‌ కేసులు నమోదైనట్టు తమ దృష్టికి వచ్చిందని, 10 కన్నా ఎక్కువ కేసులు నమోదైన పాఠశాలల మూసివేతకు ఆదేశాలిచ్చినట్టు మంత్రి వెల్లడించారు. పాఠశాల స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ సాధ్యం కాదని, ప్రైవేట్‌ పాఠశాలలు, విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement