Yellow Media Propaganda Conspiracy On AP Govt Over Kadapa Jail Superintendent Varuna Reddy - Sakshi
Sakshi News home page

ఎల్లో సిండికేట్‌ మరో దుష్ప్రచార కుట్ర

Published Wed, Feb 16 2022 4:01 AM | Last Updated on Wed, Feb 16 2022 10:31 AM

Yellow Media another propaganda conspiracy on Andhra Pradesh Govt - Sakshi

వరుణారెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, ఎల్లో మీడియా కూటమి నిత్యం అసత్య కథనాలు వండి వారుస్తున్నాయి. తాజాగా.. వారికి వైఎస్సార్‌ కడప జిల్లా జైలు అదనపు సూపరింటెండెంట్‌గా బదిలీపై వచ్చిన పి. వరుణారెడ్డి టార్గెట్‌ అయ్యారు. ఆయనను సాకుగా చేసుకుని ప్రభుత్వంపై ఆ దుష్ట కూటమి బురద జల్లుతోంది. ఈ విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి పూర్తి భిన్నంగా వాస్తవాలు ఉన్నట్లు జైళ్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అవేమిటంటే..

అప్పుడు వరుణారెడ్డి జైలు సూపరింటెండెంట్‌ కాదు
2008లో అనంతపురం జైలులో మొద్దు శ్రీను హత్యకు జైలర్‌గా ఉన్న వరుణారెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఎల్లో మీడియా ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. కానీ, వరుణారెడ్డి అప్పుడు అనంతపురం జైలు సూపరింటెండెంట్‌ కాదు. మొద్దు శ్రీను హత్య వెనుక కుట్ర కోణం ఏమీలేదని మెజిస్టీరియల్‌ విచారణలో కూడా వెల్లడైంది. వరుణారెడ్డిపై ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే శాఖాపరమైన చర్యలను ఉపసంహరించిందని ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెరలేపింది. నిజానికి ఆయనపై రెండేళ్లపాటు ఇంక్రిమెంట్‌ వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని 2013లోనే అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సవరించి ఊరట కలిగించింది.

క్యుమిలేటివ్‌ ప్రభావం లేకుండా ఏడాదిపాటు ఆయన వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేసింది. ఇక రెండో ఇంక్రిమెంట్‌ వాయిదా నిర్ణయాన్ని కూడా ఉపసంహరిస్తూ 2019, ఫిబ్రవరిలో అంటే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. శాఖాపరమైన చర్యలను ఉపసంహరిస్తూ సస్పెన్షన్‌ కాలాన్ని కూడా ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని టీడీపీ హయాంలోనే హోంశాఖ సంబంధిత ఫైలును క్లియర్‌ చేసింది. వరుణారెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా అన్ని కోణాల్లో పరిశీలించే ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడం.. కోడ్‌ కారణంగా హోంశాఖ ఉత్తర్వుల జారీని వాయిదా వేసింది. ఎన్నికల అనంతరం కోడ్‌ తొలగించాక ఉత్తర్వులు జారీచేసింది. అంతేగానీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుణారెడ్డికి అనుకూలంగా ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

కీలక పోస్టింగ్‌ ఇచ్చింది టీడీపీనే..
నాన్‌ ఫోకల్‌ (అంతగా ప్రాధాన్యతలేని) పోస్టులో ఉన్న వరుణారెడ్డికి కడప జైలు అదనపు  సూపరింటెండెంట్‌గా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కీలక పోస్టింగు ఇచ్చిందని ఎల్లో మీడియో మరో దుష్ప్రచారం చేస్తోంది. కానీ, రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న కర్నూలు జైలు అదనపు సూపరింటెండెంట్‌గా ఆయనకు టీడీపీ ప్రభుత్వమే 2016లో పోస్టింగ్‌ ఇచ్చింది. అంతటి కీలక స్థానంలో ఆయన వరుసగా ఐదేళ్లపాటు కొనసాగారు. దాంతో సాధారణ బదిలీల్లో భాగంగానే వరుణారెడ్డిని కడప జైలుకు బదిలీ చేశారు.

వృత్తిపరంగా ఆయన నిబద్ధతను టీడీపీ కూడా గతంలో ఏనాడూ ప్రశ్నించలేదు. మొద్దు శ్రీను హత్య కేసు అంశంలో ఆయనపై టీడీపీకి సందేహాలు ఉండి ఉంటే ఆయనకు ఎందుకు కీలక పోస్టింగ్‌ను ఇచ్చింది? విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు వరుణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ను ప్రకటించింది కూడా. ఇలాంటి అధికారిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని జైళ్ల శాఖ వర్గాలుఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

కడప సెంట్రల్‌ జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ బదిలీ
కడప అర్బన్‌: కడప కేంద్ర కారాగారం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఒంగోలు కారాగారం సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఐఎన్‌హెచ్‌ ప్రకాష్‌ను కడప కేంద్ర కారాగారానికి బదిలీ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement