మతి పోయి 'రివర్స్‌' రాతలు | Yellow Media Fake News On Andhra Pradesh Govt about employee salaries | Sakshi
Sakshi News home page

మతి పోయి 'రివర్స్‌' రాతలు

Published Wed, Dec 15 2021 4:27 AM | Last Updated on Wed, Dec 15 2021 4:27 AM

Yellow Media Fake News On Andhra Pradesh Govt about employee salaries - Sakshi

సాక్షి, అమరావతి: ‘చదివితే ఉన్న మతి పోయింది’ అన్నట్లుగా.. రాన్రాను ఎల్లో మీడియా విష ప్రచారం పిచ్చికి పరాకాష్టగా మారింది. నిద్దర లేస్తే ప్రభుత్వంపై విష ప్రచారం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కార్యదర్శుల కమిటీ నివేదికపై ఆ మీడియా రాసిన రాతలే నిదర్శనం. కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గిపోతాయని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఈ విష ప్రచారంపై ఉద్యోగుల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. ఈ నివేదికతో ఒక్కో ఉద్యోగి జీతంలో రూ.10 వేలు తగ్గిపోతాయని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తించడం కోసం వండినదేనని ఆగ్రహం వ్యక్టం చేస్తున్నారు. దానికి టీడీపీ వంతపాడటంపై మండిపడుతున్నారు. అదంతా విష ప్రచారమే తప్ప వాస్తవాలు వేరుగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.

14.29 శాతం ఫిట్‌మెంట్‌తో ఉద్యోగుల జీతాలు రివర్స్‌లోకి వెళ్తున్నాయన్న ప్రచారం పచ్చి అబద్ధమని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తోందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఏడాదికి సుమారు రూ.7,200 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే పడుతోందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. సీఎస్‌ కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏడాదికి సుమారు రూ.11,200 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. అంటే ఐఆర్‌కన్నా ఫిట్‌మెంట్‌ అమలు వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడుతుంది. ఇది రివర్స్‌ ఎలా అవుతుందో ఎల్లో మీడియానే చెప్పాలని పలువురు ఉద్యోగులు అంటున్నారు.

ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ.4 వేల కోట్లలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు రెగ్యులర్‌ స్కేలులోకి రావడంవల్ల, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల పడుతున్న భారం రూ.2 వేల కోట్లని నివేదిక చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. దీన్ని కూడా మినహాయించినా ఫిట్‌మెంట్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం దాదాపు రూ.2 వేల కోట్లు. ఈ వాస్తవాలకు మసి పూసి  ఉద్యోగులను రెచ్చగొట్టేలా తోక పత్రిక విషం కక్కడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో కూడా 2019 జులైలో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 10 శాతమేనని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు సైతం కేంద్ర ప్రభుత్వ సిఫార్సులనే అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 14.29 శాతమే.

వీటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా, టీడీపీ రక రకాల వక్రీకరణలతో విష ప్రచారం చేయడం ఏమిటనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, శానిటరీ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, కుకింగ్‌ హెల్పర్లకు జీతాలు పెంచిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు 70 శాతం మేర జీతాలు పెంచడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇవేమీ పీఆర్‌సీ పరిధిలోకి రావు. వాళ్లకు పెంచిన జీతాల వల్ల కలగుతున్న భారం, ఫిట్‌మెంట్‌ అమలు వల్ల కలుగుతున్న భారానికి అదనంగా ఉన్నదేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement