సభ నిర్వహించాల్సిన ఎన్టీఆర్ సర్కిల్ ఇదీ..
సాక్షి,అమరావతి/సాక్షిప్రతినిధి,నెల్లూరు/కందుకూరు: రాజకీయాలకు సంబంధించి ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ప్రజలను భ్రమింపజేయడంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరని మరోమారు నిరూపించుకున్నారు. తన ప్రచార పిచ్చి కోసం అమాయకులైన ప్రజల ప్రాణాలకు ఆయన ఏమాత్రం విలువ ఇవ్వరు.
తన రాజకీయ ప్రయోజనాలు, పబ్లిసిటీ తప్ప ఆయనకు మరేమీ కనిపించవు. ఈసారి జరగబోయే ఎన్నికలే తనకు చివరివి అని చంద్రబాబు తన నోట తానే ఒప్పుకున్నారు. ఎలాగైనా గెలవాలని, ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడకూడదని నిర్ణయించుకుని.. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెర లేపారు. ఇదేం ఖర్మ.. అంటూ ఊరూరూ తిరగడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో తన సభలకు జనం రావడం లేదనే వాస్తవాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఇరుకు సందులను ఎంచుకుని, అక్కడకి భారీగా జనాన్ని సమీకరించడం ద్వారా తండోపతండాలుగా వచ్చినట్లు చూపించే ఎత్తుగడను కొద్ది నెలలుగా అమలు చేస్తున్నారు. తన సభలు సక్సెస్ అయ్యాయని, తన జీవితంలో ఎప్పుడూ చూడనంత మంది జనం వచ్చారని ఆయన ఇటీవల పదేపదే చెబుతుండటమే ఇందుకు నిదర్శనం.
పెద్ద కూడళ్లు, గ్రౌండ్లలో సరిపడా జనం తన సభలకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన ఈ వైఖరి ఎంచుకున్నారు. ఇరుకు సందుల్లో సభలు నిర్వహిస్తూ.. సొంత టీమ్ ద్వారా డ్రోన్ షూటింగ్/ డ్రోన్ ఫొటోల ద్వారా జనం కిక్కిరిసినట్లు చిత్రీకరించడం ద్వారా పడిపోయిన తన గ్రాఫ్ పెరిగినట్లు చూపించుకునేందుకు తహతహలాడుతున్నారు.
సభ నిర్వహించిన ఇరుకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం.. (బాణం గుర్తు వైపు)
తప్పు చేసి, ప్రభుత్వంపై నెట్టేసే యత్నం
ఈ తాపత్రయంలో భాగంగానే కందుకూరులో ఇరుకు సందులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే సభ పెట్టి 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారకుడయ్యారు. ఇంతమంది ప్రాణాలు పోయినా కనీస పశ్చాత్తాపం కూడా ఆయనలో కనిపించకపోవడం అన్యాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సభకు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ నెపాన్ని చాలా తేలిగ్గా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. జగన్ సభలో ఒకరు.. పవన్ సభలో ఒకరు చనిపోయారని, ఇలాంటివి మామూలేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
2015లో గోదావరి పుష్కరాల సమయంలో పుష్కరఘాట్‌లో వేలాది మందిని ఒక గేటు వద్ద నిలిపి, ఒక్కసారిగా గేటు తెరిపించి తొక్కిసలాటకు కారణమయ్యారు. ఆ దారుణ ఘటనలో 29 మంది అమాయక యాత్రికులు మృత్యువాత పడగా, 60 మంది గాయాలపాలయ్యారు. అప్పట్లో ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కుంభమేళా తరహాలో తాను గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించానని ఒక ఇంగ్లిష్ టీవీ చానల్ ద్వారా చూపించుకునేందుకు ఆ షూటింగ్ నిర్వహించే క్రమంలో ఆ దారుణం జరిగింది. ఈ ఘటనపై అప్పట్లోనూ చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా కుంభమేళాలో జనం చనిపోలేదా? రోడ్డు ప్రమాదాల్లో ఎంత మంది చనిపోవడం లేదు? అంటూ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు కూడా కందుకూరు ఘటనపై ప్రభుత్వంపై ఆవేశంతో జనం వచ్చారంటూ.. వక్రీకరించారు. ఇలా చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటైన విద్యేనని విశ్లేషకులు చెబుతున్నారు.
రోడ్డును ఆక్రమించి టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
కింద పడ్డవారిని తొక్కుకుంటూ వెళ్లారు
నేను, నా ఫ్రెండ్ ఇద్దరం టీడీపీ మీటింగ్‌కు వెళ్లాం. బాబు వాహనానికి కొంచెం దూరంలో నిలబడి ఉన్నాం. ఎందుకో ఒక్కసారిగా జనాలు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో మా పక్కనే ఉన్న బైక్‌లు కిందపడ్డాయి. ఒక బైక్ కింద నాఫ్రెండ్ పడ్డాడు. వాడు పెద్దగా అరుస్తున్నాడు. అయినా జనాలు ఆగకుండా తొక్కుకుంటూ వెళ్తున్నారు.
వాడి అరుపులకు భయమేసి వాడిని కాపాడానికి వెళ్లాను. బైక్ కింద ఉన్న వాడిని పట్టుకుని గట్టిగా పక్కకు లాగాను. ఈ ప్రయత్నంలో నా కాలు బైక్ కింద ఇరుక్కుపోయి రక్తం కారింది. అయినా ఒకరికొకరం లాక్కుని ప్రాణాలతో బయటపడ్డాం.
– మోసీన్, ప్రమాదంలో గాయపడిన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment