సాక్షి, అమరావతి: ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోయిన ప్రతిపక్ష టీడీపీ దుష్ప్రచారాన్నే ఏకైక అస్త్రంగా చేసుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను చూసి ఓర్వలేక కుతంత్రాలకు పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సహేతుకమైన అంశాలు లేకపోవడంతో ఫొటో మార్ఫింగులు, అవాస్తవ ప్రచారాలతో రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారు. ఫొటో మార్ఫింగ్‌తో తిరుమలలో శిలువ ఏర్పాటు చేశారన్న దుష్ప్రచారం మొదలు.. తాజాగా గుజరాత్‌లోని హెరాయిన్ స్మగ్లింగ్‌ను రాష్ట్రానికి ఆపాదించేందుకు విఫలయత్నం చేయడం వరకు చంద్రబాబు ఇదే రీతిలో పన్నాగానికి పాల్పడుతున్నారు.
మత విద్వేషాలు రేకెత్తించే కుతంత్రం
►2019లో అఖండ మెజార్టీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. తిరుమలలో ఉన్న బయోడైవర్సిటీ సెంటర్ ఫొటోను మార్ఫింగ్ చేసి చర్చిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఓ శిలువ బొమ్మను కూడా జోడించి తిరుమలలో చర్చి నిర్మించారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, టీడీపీ సానుభూతిపరులే ఆ విధంగా ఫొటో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు.
►తిరుమల బస్సుల్లో టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన అంశాలు ముద్రించారని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఈ అంశంపై ఆర్టీసీ విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నెల్లూరు రీజియన్‌లో బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార అంశాలను ముద్రించేందుకు అనుమతిచ్చింది. ఆ మేరకు అనుమతి ఇచ్చిన తేదీలతో సహా అసలు విషయం బట్టబయలైంది. దాంతో టీడీపీ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది.
►టీటీడీ చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. కానీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం అత్యంత భక్తిప్రపత్తులు ఉన్న హిందూ కుటుంబం అన్నది ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ దుష్ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించడం టీడీపీ దుర్నీతికి నిదర్శనం.
►ప్రకాశం జిల్లా సింగరాయ కొండ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాల పట్ల అపచారం జరిగిందని ఓ ఫొటోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ యత్నించింది. అందుకు కొన్ని మీడియా చానళ్లు కూడా సహకరించాయి. కాగా పోలీసులు, దేవదాయ శాఖల విచారణలో వాస్తవం వెలుగులోకి వచ్చింది. దాంతో దుష్ప్రచారానికి పాల్పడ్డ వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.
►కర్నూలు జిల్లాలో ఓ ఆలయంలో అపచారం జరిగిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అందుకోసం ఓ పేద అర్చకుడికి డబ్బులు ఇచ్చి మరీ అపచారం చేయించారు. అనంతరం దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని గగ్గోలు పెట్టారు. పోలీసుల విచారణలో ఆ అర్చకుడు అసలు విషయాన్ని వెల్లడించడంతో టీడీపీ కుట్ర బెడిసి కొట్టింది.
►ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పంపిణీ చేసేందుకు ముద్రించిన ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులపైనా టీడీపీ అన్యమత ప్రచారమంటూ దుష్ప్రచార విషం చిమ్మింది. ప్రపంచ వ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు అదే రీతిలో ఉందని తేలడంతో ఒక్కసారిగా మౌనం దాల్చింది.
వరదల్లో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు
►2019లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరదలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా పేర్కొంటూ రంగంలోకి దింపింది.
►ఇళ్లు నీట మునిగాయి.. పంటలు నష్టపోయాయి.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీళ్లలో మోకాళ్లపై కూర్చొని.. తాము నిండా మునిగిపోయినట్టు డ్రామాకు తెరతీశారు. కాగా వారు సినిమా జూనియర్ ఆర్టిస్టులని బయటపడటంతో టీడీపీ డ్రామా బట్టబయలైంది.
వాస్తవం నిగ్గు తేలినా డ్రగ్స్ పేరిట డ్రామా
►అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్‌కు అక్రమంగా దిగుమతి అయిన హెరాయిన్ అంశంలోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారంతో రోజుకో రీతిలో చెలరేగిపోతున్నారు. హెరాయిన్‌ను గుజరాత్ నుంచి ఢిల్లీకి తరలించాలన్నది స్మగ్లర్ల లక్ష్యమని కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) దర్యాప్తులో మొదట్లోనే వెల్లడైంది.
►ఆ మేరకు అఫ్గానిస్తాన్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ లింక్‌లు ఆధార సహితంగా వెలుగు చూశాయి. డీఆర్‌ఐ అధికారులను బురిడీ కొట్టించేందుకే విజయవాడ అడ్రస్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా నిగ్గు తేలింది.
►కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చేలా కొన్ని వారాలుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. విజయవాడకు భారీ స్థాయిలో హెరాయిన్ వచ్చిందని, కాకినాడ పోర్టులో దిగుమతి అయ్యిందని.. తాడేపల్లిలో హెరాయిన్ నిల్వలు ఉన్నాయని.. చంద్రబాబు నిస్సిగ్గుగా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారు.
►చివరికి డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ అని డీఆర్‌ఐ నిర్ధారించింది. హెరాయిన్ దందాతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా సరే చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం తమకు అలవాటైన రీతిలో దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించే కుట్రలు కొనసాగిస్తుండటం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment