రచ్చ కోసం 'ఇంటి' బాట | Yellow Media Pawan Kalyan Chandrababu Fake propaganda YSRCP Govt | Sakshi
Sakshi News home page

రచ్చ కోసం 'ఇంటి' బాట

Published Mon, Nov 14 2022 3:14 AM | Last Updated on Mon, Nov 14 2022 3:14 AM

Yellow Media Pawan Kalyan Chandrababu Fake propaganda YSRCP Govt - Sakshi

సాక్షి, అమరావతి: పేదలు కోరుకునేది తినటానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవటానికి ఓ గూడు! వీటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. మరి ప్రజాస్వామ్యయుతంగా దీన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మించి ఇస్తున్న ప్రభుత్వంపై రాళ్లేస్తున్న వారిని ఏమనాలి? పేదల కన్నీళ్లు తుడుస్తామంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ బయల్దేరిన వారికి ఎలా బుద్ధి చెప్పాలి? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 1996–2004, 2014–19 మధ్య సీఎంగా ఉన్నారు.

ఆయన హయాంలో ఏనాడూ నిరుపేదలకు సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేసిందీ లేదు. అయినాసరే ఈనాడు రామోజీరావుకు అంతా ‘పచ్చ’గానే కనిపించింది. గూడు లేక నిరుపేదలు పడుతున్న ఇక్కట్లు ఆయన కంటికి కానరాలేదు. వారి మొర వినపడలేదు. 2014లో వచ్చిన జనసేనానిది కూడా ఇదే వైఖరి.

చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వీరు పని చేస్తారు. ప్రజలకు ఎనలేని మేలు చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలపైనా బురద జల్లేందుకు వెనుకాడరు. లక్షల మంది పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం పట్ల ఈనాడు రామోజీ, ఇతర పచ్చమీడియా, దత్తపుత్రుడి వైఖరి చూస్తుంటే’ ఇదే నిజమని మరోసారి రుజువవుతోంది. 

రూ.మూడు లక్షల కోట్ల సంపద సృష్టి
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల పథకం కింద 30.25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు విలువైన ప్రాంతాల్లో స్థలాలు పంపిణీ చేసింది. 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి రూ.56,102.91 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా 17 వేల వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు చొప్పున చెల్లిస్తోంది.

పేదలపై ఇంకా అదనపు భారం పడకూడదని, బయట అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాన్ని పావలా వడ్డీకే సమకూరుస్తోంది. మరోవైపు ఉచితంగా ఇసుక, మార్కెట్‌ ధరల కన్నా తక్కువ రేటుకు సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తోంది. సబ్సిడీపై సామగ్రి సరఫరా, ఇతర రాయితీల ద్వారా రూ.13,758 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.

కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. కరెంట్, నీరు లాంటి కనీస వసతుల కోసం రూ.3,117 కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా రూ.36,026 కోట్లు వ్యయం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వీటిలో 1.7 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 1.2 లక్షల ఇళ్లు స్లాబ్‌ దశ పూర్తై ముగింపు దశలో ఉన్నాయి.

మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పేదల ఇళ్ల నిర్మాణం ద్వారా రూ.మూడు లక్షల కోట్ల సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. అది ఎలాగంటే.. ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల విలువ గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉండగా పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకూ ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఆస్తి విలువ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మేరకు చేరుతుంది. ఈ లెక్కన 31 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ల కల్పన ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల మేర సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. 

ఆర్నెళ్లలో రెండు రకాలుగా..
ప్రభుత్వం చేస్తున్న సాయంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారంటూ రామోజీ తన పత్రికలోనే కొద్ది నెలల క్రితం కథనాలు ప్రచురించారు. అయితే ఐదారు నెలలు తిరగక ముందే కొత్త పల్లవి అందుకున్నారు. ప్రభుత్వమే కొన్ని కంపెనీల ద్వారా చేపట్టిన ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణంలో స్కామ్‌ జరుగుతోందనే ఆరోపణలకు దిగారు. ఆర్నెళ్లలోనే భిన్నాభిప్రాయాలను వెలువరించడం ఆయనకే చెల్లింది. అసలు ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణంలో స్కామ్‌లు, అక్రమాలు జరుగడానికి తావు లేదు. ఇళ్ల లబ్ధిదారులందరికీ రూ.1.80 లక్షల బిల్లు, బ్యాంకు రుణం ద్వారా రూ.35 వేలు సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అంటే మొత్తంగా రూ.2.15 లక్షలు. ఈ సాయం అందించినా ఇళ్ల నిర్మాణం తమవల్ల కావడం లేదని, ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులు కోరారు. దీంతో లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం నిర్ధారించిన రూ.2.15 లక్షల మొత్తంతోనే ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కొన్ని కంపెనీలు, భవన నిర్మాణ మేస్త్రీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వీరికి లబ్ధిదారులతో ఒప్పందం కుదిర్చి ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో ఈనాడుకు ఏం స్కామ్‌ కనిపించిందని అడ్డుకుంటున్నారని ఆప్షన్‌–3 లబ్ధిదారులు మండిపడుతున్నారు. 

ఎందుకింత అక్కసు అంటే..?
దేశంలో ఎక్కడా లేని రీతిలో పేదలెవరూ సొంతిల్లు లేక ఇబ్బంది కూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం చూసి చంద్రబాబు బృందం బెంబేలెత్తుతోంది. ఈ పథకం దిగ్విజయంగా పూర్తయితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే దృఢ నిశ్చయానికి వచ్చిన ఆయన దీన్ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తమ పార్టీ నాయకుల ద్వారా కోర్టులను ఆశ్రయించి ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకాలు కల్పించారు.

అయితే ప్రభుత్వ సంకల్పం ముందు ఈ కుటిల యత్నాలు ఫలించలేదు. దీంతో ఈనాడు, ఇతర పచ్చ మీడియా ద్వారా తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగించారు. అయితే అది కూడా ఆశించిన మేర ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి దత్తపుత్రుడిని రంగంలోకి దింపారు. తొలి నుంచి ఈ చేష్టలు గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు జనసేనాని ఆదుర్దా అంతా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమై విలపిస్తున్న బాబు కన్నీళ్లు తుడవడం కోసమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
 

మా కన్నీళ్లు నాడు కనపడలేదా?
మాటల ప్రభుత్వం కాదని రుజువు చేశారు
మహారాష్ట్ర నుంచి జీవనోపాధి కోసం 13 ఏళ్ల క్రితం వచ్చి పాలకొండలో స్థిరపడ్డాం. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నాకు ముగ్గురు పిల్లలు. అద్దె ఇంట్లో ఉంటున్నా. ఆధార్, రేషన్, ఓటరు కార్డు పాలకొండలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు మంజూరు చేయలేదు.

గత ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ వాగ్దానాలు చూసి అందరూ ముందు ఇలాగే మాటలు చెబతారు. అధికారంలోకి వస్తే పట్టించుకోరని భావించా. ఇది మాటల ప్రభుత్వం కాదని సీఎం జగన్‌ రుజువు చేశారు. మాకు ఇంటి స్థలం, ఇళ్లు మంజూరైంది. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతున్న పార్టీలు నాడు మా గోడు 
ఆలకించలేదు.
– కుంబారు సంతోష్, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా

రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు
అరకొర సంపాదనలో నెలకు రూ.3 వేలు ఇంటి అద్దె, ఇతర అవసరాలకు సరిపోయేది. టీడీపీ అధికారంలో ఉండగా ఎన్నిసార్లు ఇంటి స్థలం చోసం దరఖాస్తు చేసుకున్నా 
ఫలితం దక్కలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్‌ మా ఇంటికే వచ్చి దరఖాస్తు తీసుకున్నాడు. రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి  రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చారు.
– కొల్లి కన్నమ్మ, కొత్త మూలకుద్దు, భీమిలి మండలం, విశాఖ జిల్లా

ఫలించిన 40 ఏళ్ల నిరీక్షణ
సొంతింటి కోసం 40 ఏళ్లుగా ఎదురు చూశా. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాకే ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. ప్రైవేట్‌ వెంచర్ల తరహాలో నీటి కోసం బోర్లు, కరెంట్‌ సరఫరా చేపట్టారు. సిమెంట్, ఐరన్, ఇసుక ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నారు. 
– పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు జిల్లా

నాడు ఆరుసార్లు దరఖాస్తు
గత ప్రభుత్వ హయాంలో ఆరుసార్లు ఇళ్ల పథకానికి దరఖాస్తు చేస్తుకున్నా రాలేదు.అర్హత ఉండి కూడా మాకు ఇల్లు మంజూరు చేయకపోవడంపై అధికారులను పశ్నిస్తే సమాధానం లేదు. నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాకు మొదటి విడతలోనే పక్కా గృహాన్ని మంజూరు చేసింది. ఈ రోజు ప్రజల కన్నీటి గురించి మాట్లాడుతున్న ఏ నాయకుడూ ఆ రోజు కనిపించలేదు. 
– స్నేహలత, కోట గుండ్ల పల్లె, అన్నమయ్య జిల్లా

జనసేన, ఈనాడు మొసలి కన్నీళ్లు
20 ఏళ్లు నిలువ నీడ లేక ఇబ్బంది పడితే ఏ నాయకుడూ పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా సెంటు స్థలం ఇవ్వలేదు. ఆ పార్టీకి వత్తాసు పలికే జనసేన, ఈనాడు మా గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారంతా పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు జగనన్న కాలనీల సందర్శనకు వస్తున్న పవన్‌ టీడీపీ హయాంలో మేం నిలువ నీడలేక ఇబ్బంది పడినప్పుడు ఏమయ్యారు?  సీఎం జగన్‌ చేస్తున్న సాయం చాలా పెద్దది. మేం ఎంతో తృప్తిగా ఉన్నాం. 
– సాంబశివ, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా

ఈ సాయం ఎంతో గొప్పది..
దశాబ్దాలుగా సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా స్థలం, ఇల్లు సమకూరాయి. ప్రభుత్వం చేస్తున్న సాయం మాకెంతో గొప్పది. అధికారంలో ఉండగా సెంటు భూమి ఇవ్వని టీడీపీని పవన్‌ ఎందుకు విమర్శించడం లేదు?  
– శ్రీచందన, బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారి పల్లి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా

డీడీ కట్టించుకుని ఇల్లు లేదన్నారు..
గత ప్రభుత్వ హయాంలో పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే డీడీ కట్టించుకుని చివరకు ఇల్లు లేదన్నారు. డబ్బులు వసూలు చేసి అనర్హులకు ఇళ్లు  కేటాయించారు. దీంతో ఇక ఇల్లు వస్తుందనే ఆశ వదులుకున్నా. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనర్హులను తొలగించి మాలాంటి పేదలను గుర్తించి రూపాయికే ఇల్లు ఇచ్చింది. 

సొంతింటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. అన్ని వసతులతో పేదలకు ఇల్లు కేటాయించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.
– కమల, మంగళగిరి, గుంటూరు జిల్లా

మా కన్నీళ్లు ఈరోజు గుర్తొచ్చాయా?
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్‌కు పేదలు ఎందుకు గుర్తు రాలేదు? ఈ ప్రభుత్వం మాకు నిలువ నీడ కల్పించి కన్నీళ్లు తుడుస్తుంటే బురద చల్లుతారా?
– ఇడుపుల రాజకుమారి, మాగల్లు, ఎన్టీఆర్‌ జిల్లా

తప్పుడు ప్రచారం..
పుత్తూరు పరిధిలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి కావస్తోంది. నాలా ఎంతో మంది గృహ ప్రవేశాల కోసం ముహుర్తాలు పెట్టుకుంటున్నారు. కాలనీల్లో అన్నీ బాగున్నాయి. మేం సంతోషంగా ఉన్నాం. టీడీపీ, జనసేన, వారి అనుకూల పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
– ఎ. రాధిక, రాజాజీ స్ట్రీట్, పుత్తూరు, చిత్తూరు జిల్లా

మా కష్టసుఖాలు మీకేం తెలుసు?
టీడీపీ, జనసేన, వాటి అనుకూల పత్రికలు, చానళ్లకు మా బాధలు, కష్టాలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? వారికి నిజంగా మా కష్టాలు తెలిసి ఉంటే ఇన్నేళ్లు మేం అద్దె ఇళ్లలో ఉండాల్సిన దుస్థితి ఉండదు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇల్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదు? ఆ పార్టీకి మద్దతిచ్చి గెలిపించిన పవన్‌ నాడు ఎందుకు ప్రశ్నించలేదు?  మా బాధలు, కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం జగన్‌ ఒక్కడే. అందుకే మాకు ఈ రోజు సొంత ఇళ్లు సమకూరుస్తున్నారు.    
– బొడసింగి పుణ్యావతి, జగతిమెట్ట కాలనీ , టెక్కలి, శ్రీకాకుళం జిల్లా

ఈనాడు ద్వంద్వ వైఖరి ఇలా..
13–06–2022
రూ.1.80 లక్షల బిల్లు, రూ.35 వేలు బ్యాంకు రుణం కలిపి మొత్తంగా రూ.2.15 లక్షల్లో ఇల్లు పూర్తి చేయాలా...? అబ్బే ఎలా కుదురుతుంది..? ఇచ్చే డబ్బుకు, అయ్యే ఖర్చుకు పొంతన లేకుండా పోతోంది. పేదలు ఇళ్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పేదల ఇళ్లు పునాదే దాటడం లేదు.
 09–11–2022
పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తోంది. ఆ సంస్థలు ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల బిల్లు, లబ్ధిదారులకు బ్యాంకు రుణం కింద వచ్చే రూ.35 వేలు కలిపి మొత్తం రూ.2.15 లక్షలతో ఇంటిని నిర్మిస్తున్నారు. దీని వెనుక పెద్ద స్కామ్‌ దాగుంది!! 

పేదల పట్ల దత్తపుత్రుడి విధానం
నాడు (2014–19)
టీడీపీ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచిన దాఖలాలు లేవు. నిలువ నీడ లేదని పేదలు ప్రాథేయపడ్డా ఇళ్ల దరఖాస్తులను పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షల మంది నిరుపేదలు తలదాచుకునేందుకు చోటు లేక, అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నా ఏ రోజూ జనసేనాని స్పందించ లేదు. నాటి ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించలేదు.
నేడు (2019 తరువాత)
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 31 లక్షల మంది నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తోంది. ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు బిల్లు రూపంలో, పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణం ద్వారా సాయం చేస్తోంది. రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పేదలకు మేలు జరుగుతుంటే లోపాయికారీ ఒప్పందాల మేరకు కన్నీళ్లు తుడుస్తానంటూ, ప్రశ్నిస్తానంటూ బయల్దేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement