అరాచకం.. ఆటవికం.. ‘రెడ్‌’ రూల్‌! | YS Jagan fires on government | Sakshi
Sakshi News home page

అరాచకం.. ఆటవికం.. ‘రెడ్‌’ రూల్‌!

Published Sat, Jul 27 2024 6:03 AM | Last Updated on Sat, Jul 27 2024 7:34 AM

YS Jagan fires on government

కూటమి సర్కారు పాలనపై వైఎస్‌ జగన్‌ కన్నెర్ర

హామీలపై నిలదీస్తారనే భయంతోనే టీడీపీ భయోత్పాతం 
ఏకంగా లోకేశ్‌ రెడ్‌బుక్‌ పేరిట హోర్డింగ్‌లు

దీన్ని చూసి గ్రామస్థాయి నుంచి రెచ్చిపోతున్న టీడీపీ మూకలు

ప్రత్యర్థులపై కక్ష సాధింపులు, హత్యలు, హత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం 

గత 45 రోజుల్లో 8 మంది మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు

నలుగురు మహిళలు, బాలికలపై అత్యాచారం, హత్య

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా మహిళలకు అండగా ‘దిశ’

వైఎస్‌ జగన్‌కు పేరు వస్తోందనే దుగ్ధతోనే ఆ వ్యవస్థను నీరుగార్చారు 

సాక్షి, అమరావతి:  ‘‘ఏపీ’’ అంటే ఈరోజు అరాచకం, ఆటవికం, రెడ్‌బుక్‌ పాలన అన్నట్లుగా కూటమి సర్కారు మార్చేసిందని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దునుమాడారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని ప్రజలను భయ­భ్రాంతులకు గురి చేసేందుకు నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్ర­తలు అధఃపాతాళానికి దిగజారినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషి­స్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్‌ రెడ్‌బుక్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లు పెట్టారు. వీటి ద్వారా పోలీసులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటు­న్నారు? హత్యలు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడతాం..! పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండని చెబుతున్నట్లే ఉంది! ఆయా ఘట­న­లపై కేసు­లు పెడితే తోలు తీస్తాం..! బాధితులపైనే తిరిగి కేసులు పెట్టండి అని అనడానికి ఇది నిదర్శనం కాదా?’ అని నిలదీశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమ­న్నా­రంటే..

రెడ్‌బుక్‌ పేరిట హత్యలు..హత్యాచారాలు.. దాడులు
లోకేశ్‌ రెడ్‌బుక్‌ను చూసి గ్రామాల్లో టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. టీడీపీ విధ్వంసకాండపై మేం ఢిల్లీలో నిరసన తెలుపుతుంటే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ సాంబిరెడ్డిపై దాడి చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆయన చనిపోయాడని భావించి వదిలేశారు. రాజకీయంగా విభేదించారని ఇలా దాడులు చేస్తారా? ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని దాడులకు తెగబడటం «ధర్మమేనా? చంద్ర­బాబు ఇచ్చిన అలవిగాని హామీలపై ఎవరూ ప్రశ్నించ­కూడదు! ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే ఏం జరుగుతుందోనని భయం కల్పించేందుకే ఇలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.

పల్నాడులో పరాకాష్టకు సాధింపులు
వినుకొండలో రషీద్‌ను హత్య చేసిన నిందితుడు జిలాని స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్‌ తినిపిస్తూ ఫోటోలు దిగాడు. ఎమ్యెల్యే, టీడీపీ నాయకులతో నిందితుడు అంటకాగినా కేసులో ఎక్కడా వారి పేర్లు లేవు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. పోలింగ్‌కు ముందు అక్కడ ఎస్పీగా ఉన్న రవిశంకర్‌రెడ్డి సమర్థంగా పని చేస్తుండటంతో ఆయన్ను బదిలీ చేయించి బిందుమాధవ్‌ను తెచ్చుకున్నారు. ఆయన చేసిన ఆకృత్యాలు తెలుసుకుని ఈసీ సస్పెండ్‌ చేసింది. అనంతరం వచ్చిన మలికాగార్గ్‌ టీడీపీ నాయకుల మాట వినడం లేదని శ్రీనివాస్‌ను ఎస్పీగా తెచ్చారు. ఆ తరువాత మూడో రోజే రషీద్‌ను నడి రోడ్డు మీదే దారుణంగా నరికేశారు. 

మహిళల భద్రత గాలికి
కేవలం గత 45 రోజుల వ్యవధిలో ఎనిమిది మంది మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నలుగురిపై అత్యాచారం, హత్యా ఘటనలు జరిగాయి. 12 మంది మహిళలు, చిన్నారి బాలికలపై అత్యంత దారుణమైన ఘటనలు కూడా వెలికి చూశాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు దిశ యాప్‌ రక్షణ కవచంలా నిలిచింది. 1.41 కోట్ల మంది ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

ఎవరైనా ప్రమాదంలో ఉన్న మహిళలు, యువతులు ఫోన్‌ను షేక్‌ చేసినా.. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా వెంటనే పోలీసులకు అలెర్ట్‌ వెళ్లేది. పోలీసులు తక్షణమే బాధిత మహిళకు ఫోన్‌ చేసేవారు. ఒకవేళ బాధితులు ఫోన్‌ లిఫ్ట్‌ చేసే పరిస్థితిలో లేకుంటే పోలీసులే నేరుగా ఘటనా స్థలికి వెళ్లి రక్షించేవారు. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం మహిళల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దిశ యాప్‌తో జగన్‌కు క్రెడిట్‌ వస్తోందనే దుగ్ధతో దాన్ని వదిలేశారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లది ఇదే పరిస్థితి!  

చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌
సీఎం చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. దారుణ హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని నేను పరామర్శించడం, రాష్ట్రం­లోని అరాచక పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సీఎం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డిపై నిందలు మో­పుతూ దుష్ప్ర­చారం చేశారు. హుటా­హుటిన డీజీపీ, సీఐడీ ఏడీజీని చంద్రబాబు అక్కడికి హెలికాప్టర్‌లో పంపారు. ఆర్డీవో కార్యాల­యంలో రికార్డులు కాలిపోతే కలెక్ట­రేట్, సీసీఎల్‌ఏలో రికార్డులు ఉంటాయి కదా? చివరకు ఆన్‌లైన్‌లో కూడా అందు­బాటులో ఉంటాయి. అయినా కూడా ఏదో జరిగి­పో­తు­న్నట్లు హైడ్రామా సృష్టించారు.

పెద్దిరె­డ్డిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు మిథున్‌ను మూడు సార్లు ఎంపీగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాదరణ ఉన్న కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు నిందలు మోపుతున్నారు. మిథున్‌ కారును ధ్వంసం చేయడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును కాల్చి వేసి రాళ్లతో దాడులకు పాల్ప­డ్డారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసు­కో­వాలని ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితు­లపైనే కేసులు బనాయి­స్తున్నారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు ఎందు­కంత కోపం అంటే.. కాలేజీలో చదువు­కునే సమయంలో ఆయన కొట్టాడట! ఆ కక్షతో పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రిగా పని­చేసినా ఆ శాఖపై చంద్రబాబు దుష్ప్ర­చారం చేస్తారు. 

మద­న­పల్లెలో అగ్నిప్ర­మాదం జరిగితే డీజీపీని ప్రత్యేక హెలి­కాప్టర్‌లో పంపిన చంద్ర­బాబు నంద్యాల జిల్లా ముచ్చు­మర్రిలో మైనర్‌ బాలిక అదృశ్యమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయ­డానికి మాత్రం ముందుకు రారు. జూలై 7న బాలిక అదృశ్యమైతే 16న ఎస్పీ ప్రెస్‌మీట్‌ పెడతారు. దళితుడిని లాకప్‌ డెత్‌ చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే ఎస్పీని బదిలీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement