వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం | ys Jagan reiterates YSRCP continued support for Muslim welfare vows to oppose Waqf Bill | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

Published Fri, Aug 23 2024 5:40 AM | Last Updated on Fri, Aug 23 2024 5:40 AM

ys Jagan reiterates YSRCP continued support for Muslim welfare vows to oppose Waqf Bill

ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటన 

బిల్లుపై వారు ప్రస్తావించిన అన్ని అంశాలు పార్లమెంటులో తమ ఎంపీలు లేవనెత్తుతారని హామీ

వారి అభ్యంతరాలను జేపీసీ సభ్యుడైన విజయసాయిరెడ్డి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని భరోసా 

ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచిందన్న వైఎస్సార్‌సీపీ అధినేత

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకి­స్తున్నా­మని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆ బిల్లుపై ముస్లిం మైనార్టీలు ప్రస్తావి­స్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని భరోసా ఇచ్చా­రు. పార్లమెంటు సంయుక్త కమిటీ(జేపీసీ)లో సభ్యుడుగా ఉన్న తమ పార్టీ ఎంపీ విజయ­సాయి­రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని ముస్లింల అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని వారికి హామీ ఇచ్చారు. తాడే­పల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువా­రం ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై వైఎస్సార్‌సీపీ తొలి నుంచి అండగా నిలిచిందని.. వారి వెంట నడుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్‌ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్‌) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

మొత్తం వ్యవస్థను  కొత్త వక్ఫ్‌ బిల్లు నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. ఆ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్‌ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించడం వల్లే.. కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తుచేశారు. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం హయాంలో అనేక చర్యలు తీసుకున్నామని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ చెప్పారు. వక్ఫ్‌ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చడం ఒక గొప్ప పరిణామమన్నారు. ముస్లింలకు వైఎస్‌ జగన్‌ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో 60ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement