మనసున్నవాడు పాలకుడు అయితే పాలన ఎంత ప్రజారంజకంగా ఉంటుందో.. గుండెలో తడి ఉన్న నేత రాజు అయితే ప్రజల కళ్లలో తడి చేరకుండా ఎలా పాలిస్తాడో.. ప్రజలను ఓటర్లుగా కాకుండా తన వాళ్లుగా చూసే నాయకుడు సింహాసనం ఎక్కితే ఎంతటి సంక్షేమం సాధ్యమో దేశానికి చాటి చెప్పిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఎందుకంటే ఆయన అమ్మానాన్నల కష్టం తెలిసిన ఓ కొడుకు. చదువు‘కొనలేక ’పోతున్న విద్యార్థుల మానసిక క్షోభ తెలిసిన ఓ తండ్రి. అవ్వాతాతల బాధలు చూసిన ఓ మనవడు. రైతు రుణం తీర్చుకోవాలనే ఓ రుషి. పేదోడి గుండె చప్పుడు విన్న మనసున్న ఓ రాజు. అందుకే ఆయన రాజకీయనేత కాకుండా అభివృద్ధి శ్రామికుడిగా.. సామాజికవేత్తగా.. వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఆర్థిక నిపుణుడిగా.. అన్నింటికీ మించి ప్రతి ఇంటి సభ్యుడిగా తరతమ భేదం లేకుండా పాలించి.. తెలుగువారి గుండెల్లో అభివృద్ధి సంతకం చేసి.. చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా పెద్దాయన హయాంలో జిల్లా అభివృద్ధి.. అనుబంధంపై ప్రత్యేక కథనాలు.
విద్యా ప్రదాత వైఎస్సార్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతిపై ఎంతో ప్రేమ చూపారు. నగరంలోని విద్యాసంస్థలపై తనదైన ముద్ర వేశారు. తిరుపతి లో శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర వేదిక వర్సిటీ ఏర్పాటు చేశారు. అలాగే శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా మహిళా ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు.
వెటర్నరీ వర్సిటీ: తిరుపతిలోని వెటర్నరీ కళాశాల ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం పరిధిలో ఉండేది. 2004 సెప్టెంబర్ 30న నిర్వహించిన కళాశాల స్వర్ణోత్సవాల ప్రారంభ సభలో శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి, 2005 జూలై 15వ తేదీన ఏర్పాటు చేయడంతో పాటు రూ.43 కోట్ల నిధులు కేటాయించారు. అనంతరం మరో రూ.100 కోట్ల నిధులు ఇచ్చి వర్సిటీని అభివృద్ధి చేశారు.
ఎస్వీయూ : ఎస్వీయూలో 2004లో నిర్వహించిన స్వర్ణోత్సవాలకు హాజరై, పలు వరాలు ప్రకటించారు. 2007లో 125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు. అదే సంవత్సరం సుమారు 400 మంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అందించి, వారి జీవితాల్లో వెలుగు నింపారు.
మహిళా వర్సిటీ: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి ఇంజినీరింగ్ కళాశాల ఇదే. అలాగే వర్సిటీలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వేదిక్ వర్సిటీ: 2006 జూలై12న తిరుపతిలో వేదిక్ వర్సిటీ ఏర్పాటుకు వైఎస్సార్ ఆమోదం తెలిపారు. అనంతరం ఎస్వీయూకు సమీపంలో అవసరమైన స్థలాన్ని అందించి, భవన నిర్మాణాలు చేపట్టారు. అదే ఏడాది ఆగస్టు 19న భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 147.6 ఎకరాల్లో వేదిక్ వర్సిటీ సుందరభవనాల మధ్య అలరారుతోంది.
పేరు పెట్టి పిలిచేంత అనుబంధం
పుంగనూరు: నియోజకవర్గ నాయకులతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం చెప్పలేనిది. పుంగనూరులో వైఎస్సార్ మూడు సార్లు పర్యటించారు. తొలుత 1996 ఉప ఎన్నికల్లో పుంగనూరుకు వచ్చిన సందర్భంగా వైఎస్సార్ స్థానిక ట్రావెల ర్స్ బంగ్లాలో కొద్దిసేపు గడిపారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుత ఎంపీ రెడ్డెప్ప ను ఏం...రెడ్డెప్ప అంటూ అప్యాయంగా పేరు పెట్టి పిలిచేవారు. అలాగే అప్పటి కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంను ఏం...భూషణ్ అంటూ సంబోధించేవారు.
కేబీడీ షుగర్స్ మాజీ పీఆర్వో రాంకుమార్‌రెడ్డి, పారిశ్రామికవేత్త ఎంఎం.మహమ్మదాలి తదితరులతో వైఎస్సార్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు విడదీయరాని అనుబంధం ఉండేది. అలాగే చౌడేపల్లె మండలంలోని వైఎ స్సార్ సీపీ నేత మిద్దింటి శంకర నారాయణ, సోమల మండలంలోని రామచంద్రయ్య, రామసముద్రంలోని సీతారామయ్యను వైఎస్సార్ పేరు పెట్టి పిలిచేవారు. అలాగే 2004 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎంపీ మిధున్‌రెడ్డితో రహస్య సంభాషణ చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్‌కు మంత్రి పెద్దిరెడ్డి వేంకటేశ్వరుని పటం జ్ఞాపికగా అందజేశారు.
సత్యవేడు అభివృద్ధికి రాజబాట
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధికి వైఎస్సార్ రాజబాట వేశారు. 2004లో వైఎస్సార్ రాజీవ్ పల్లెబాట కార్యక్రమం ద్వారా జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటించి, వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలతోపాటు ఉబ్బలమడుగు, భుపతేశ్వరకోన, రాళ్లవాగు నీటి ప్రాజెక్టుల ఏర్పాటు చేశారు. అన్నింటికీ మించి నేడు దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామికవాడగా పేరు పొందిన శ్రీసిటీకి కూడా ఆయన రూపకల్పన చేశారు. 2006లో అధికారికంగా సెజ్‌కు జెండా ఊపి 2008 ఆగస్టు 8వ తేదీన 8 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఆయన సంకల్ప బలం 8 పరిశ్రమలతో మొదలైన శ్రీసిటీ అంచలంచెలుగా అభివృద్ధి చెంది 187 పరిశ్రమలకు కేంద్రంగా మారింది. రూ. 28వేల కోట్ల పెట్టుబడులతో 27 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
కరువునేలపై జలసిరి!
బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్ పలు పథకాలు, ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయించారు. వైఎస్సార్ సీఎం అయ్యాక నియోజకవర్గానికి ఒకేసారి నాలుగు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేశారు. రూ.3.43 కోట్లతో పెద్దమండ్యం మండలంలో 2,400 ఎకరాలు సాగులోకి వచ్చేలా ఆకుమానుగుట్ట ప్రాజెక్టును నిర్మించారు. తంబళ్లపల్లె సమీపంలో రూ.8.50 కోట్లతో చిన్నేరు ప్రాజెక్టు నిర్మించారు. దీనికింద 2200 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. కోసువారిపల్లె గ్రామంలో రూ.3.17కోట్లతో దబ్బలగుట్టపల్లె ప్రాజెక్టు నిర్మించారు. 600 ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి తీసుకువచ్చారు. పెద్దతిప్పసముద్రం మండలం మడుమూరు గ్రామంలో రూ.6.20కోట్లతో మిట్టసానిపల్లె ప్రాజెక్టును మంజూరు చేశారు. దీనికింద 1,200 ఎకరాల ఆయుకట్టు భూమి సాగులోకి వస్తుంది.
హంద్రీ–నీవాతో ప్రయోజనం
ఏవీఆర్ హంద్రీ–నీవా రెండోదశ ప్రాజెక్టు కాలువల ద్వారా నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనం చేకూర్చారు. కలిచర్ల జలాశయం, తంబళ్లపల్లె బ్రాంచ్‌కెనాల్, పుంగనూరు బ్రాంచ్‌కెనాల్ పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తి చేయించారు. వీటి ద్వారా 46,550 ఎకరాలు సాగులోకి వచ్చేలా కాలువల నిర్మాణం జరిగింది. ఈ కాలువల కింద పెద్దమండ్యంలో 10వేల ఎకరాలు, ములకలచెరువులో 9,565, బి.కొత్తకోటలో 6,900, పీటీఎంలో 4,685, తంబళ్లపల్లెలో 5000, కురబలకోటలో 5000 ఎకరాలు సాగులోకి రానున్నాయి. గచ్చంవారిపల్లె వద్ద రూ.7.50కోట్లతో కొత్తచెరువు, వెలిగల్లు ఛానల్ ద్వారా రూ.4.30కోట్లతో ఆరు చెరువులకు నీటి మళ్లీంపు పథకం, ములకలచెరువు మండలంలోని ఏడు మడకల కాలువ కోసం రూ.1.80 కోట్లు మంజూరు చేశారు.
కుప్పంపై ‘రాజ’ముద్ర
శాంతిపురం: కుప్పం నియోజకవర్గంతో దివంగత నేత వైఎస్సార్‌కు విడదీయలేని బంధం ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గంలో రూ.69.03 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీతోపాటు 24,254 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్ అందించారు. 23,144మంది రైతులకు చెందిన రూ.60.24 కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు. మరో 5వేల మందికి రూ 5వేల వంతున ప్రోత్సాహకాలను అందజేశారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి, రూ.55కోట్లు నిధులు విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలో 36 వేల పైచిలుకు ఇళ్లను మంజూరు చేశారు. 26 వేల రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు. 793 మందికి ఆరోగ్యశ్రీ పథకంతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు.
విద్యకు ప్రాధాన్యం
ద్రావిడ యూనివర్సిటీకి నిధుల కొరత లేకుండా చూసి, 14 కొత్త కోర్సులు ప్రారంభమయ్యేందుకు మహానేత కారణమయ్యారు. దివంగత వైఎస్సార్ తన హయాంలోనే కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబకలదొడ్డి వద్ద ప్రభుత్వ ఐటీఐలను ఏర్పాటు చేశారు. శాంతిపురం, రావుకుప్పం, గుడుపల్లి, కుప్పంలో కస్తూర్బా గాంధీ పాఠశాలల ప్రారంభం ద్వారా బాలికల విద్యకు ఊతం ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో 5 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు.
ఆ పిలుపు నేటికీ మదిలో..
తంబళ్లపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనని అన్నా అంటూ పిలిచే పిలుపు నేటికీ తన మదిలో మెదులుతోందని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి (అప్పా) వైఎస్సార్‌తో ఉన్న సంబంధాన్ని గతస్మృతులను తలచుకుంటూ సాక్షితో పంచుకున్నారు. 1989లో తంబళ్లపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించినప్పుడు తనను అభినందిస్తూ ఎంతో ప్రోత్సహించారు. జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గంలో మొదటి వ్యక్తిగా నేటి వరకూ కొనసాగుతున్నానన్నారు. ఆయనతో తనకున్న సన్నిహిత సంబంధాలు మరుపురానివన్నారు. 2004 ఎన్నికల ప్రచార సభలో తంబళ్లపల్లెను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తంబళ్లపల్లె మూడు రోడ్ల కూడలిలో హామీ ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఆకుమానుగుట్ట, చిన్నేరుప్రాజెక్టు, దబ్బలగుట్ట ప్రాజెక్టులను మంజూరు చేసి, రైతు పక్షిపాతిగా నిలిచారన్నారు. ఆయన చూపే ఆప్యాయత, అనురాగాలు, పలకరింపులు ఊపిరున్నంత వరకూ మరుపురానివన్నారు. ఇచ్చినమాటకు కట్టుబడి అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. అందుకే నేటికీ ఆయన మహానేతగా మరుపురాని వ్యక్తి గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
తిరుపతికి వన్నె తెచ్చిన మహానేత
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వన్నెతెచ్చిన నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగు భాష.. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దారు. తెలుగు భాష, తెలుగు ఆనవాయితీ, తెలుగు సంస్కృతిపై ఆయనకున్న గౌరవానికి తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలే నిదర్శనం. తెలుగు భాషాభిమానంతో అన్నమయ్య 600వ జయంతిని అత్యంత వైభవంగా తాళ్లపాకలో నడిపించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు దీటుగా తెలుగు సంస్కృతి, సాహితీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించటానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర గేయాన్ని రాసిన శంకరంబాడి, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాలను స్థాపనకు శ్రీకారం చుట్టారు. అలాగే తిరుపతి ముఖద్వారంలో పూర్ణకుంభం ఏర్పాటు చేసి.. పూర్ణకుంభం కూడలిగా నామకరణం చేశారు. అలాగే తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటు చేసి తిరుపతి నగరాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment