సాక్షి, అమరావతి: రెండునెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం వచ్చేనెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేటనిషేధ భృతి) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తడ మొదలు ఇచ్ఛాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీటిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి.
ఏటా పెరుగుతున్న బోట్లు
డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేటనిషేధ భృతిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది.
పైగా ఈ మొత్తాన్ని నిషేధకాలం ముగియకుండానే బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందించగా, గడిచిన 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది. అదేరీతిలో ఈ ఏడాది కూడా మే రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అర్హుల గుర్తింపునకు బృందాలు
ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వలంటీర్, సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో ఈ నెల 17వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. ఆరోజు తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయి. గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్‌కార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
18వ తేదీ గ్రామ సచివాలయ డిపార్టుమెంట్ రూపొందించే సాప్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ డేటా ఆధారంగా ఆరుదశల వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాల్లో చేర్చి తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది.
అర్హులు వీరే..
♦ 18 మీటర్లకుపైన పొడవు ఉండే మెకనైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా 10 మంది, 18 మీటర్ల లోపులో ఉండే మోటరైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా ఎనిమిదిమంది, ఇతర మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లకు యజమానితో సహా ముగ్గురు చొప్పున అర్హులు.
♦ వయసు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి.
♦ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు ఉండాలి.
♦ సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు.
♦ అర్బన్ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment