YSR Rythu Bharosa: Eenadu Never Said True This Is History in Rythu Bharosa- Sakshi
Sakshi News home page

‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర

Published Mon, Dec 13 2021 8:41 AM | Last Updated on Mon, Dec 13 2021 3:40 PM

YSR Rythu Bharosa: Eenadu Never Said True This Is History in Rythu Bharosa - Sakshi

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామంలో కళ్లం వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలిస్తున్న రైతు భరోసా కేంద్రం సిబ్బంది

నిజమే!! భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలింది. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువొస్తుందని ‘ఈనాడు’కు కూడా తెలుసు. ఆ ధాన్యానికి మామూలు ధాన్యం కన్నా తక్కువ ధర వస్తుందనేది కూడా నిజమే కదా? ఒకవేళ దానిక్కూడా మామూలు ధరే వస్తే... సాధారణ రకం ధర పెంచమని అడగరా? ఇవన్నీ రామోజీ రావుకు తెలియనివా?  తెలిసి కూడా ‘వరికి కన్నీటి తడి’ అంటూ అక్కసు వెళ్లగక్కటమెందుకు? ఎందుకంటే రైతన్నల విషయంలో ఈ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం ఊహించటం కూడా చేయని పనులను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిశ్శబ్దంగా చేసుకుపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ ‘కన్నీటి తడి’. ‘ఈనాడు’ రాతల్లో నిజానిజాలేంటో... రైతుల విషయంలో ప్రభుత్వ అడుగులు ఎలా ఉన్నాయో వివరించే కథనమిది..

ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఐదేళ్లు రాష్ట్రాన్నేలింది రామోజీ మిత్రుడు చంద్రబాబే. మరి ఆ ఐదేళ్లలో ఒక్కసారైనా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొన్నారా? వరదలొచ్చి రైతులు గగ్గోలు పెట్టినా పట్టించుకున్నారా? విచిత్రమేంటంటే నాటి ప్రభుత్వమే కాదు. ‘ఈనాడు’ సైతం పట్టించుకుంటే ఒట్టు. బాబు హయాంలో ధాన్యం కొనుగోలుకు ఏటా పెట్టిన ఖర్చు రూ.8వేల కోట్లు. ఇపుడది రెట్టింపు కన్నా అధికం. రూ.17వేల కోట్ల పైమాటే. ఈ రెండేళ్లలో ధాన్యానికి ఏకంగా రూ.35 వేల కోట్లు ఖర్చుచేశారన్న నిజాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పలేదే? ఎందుకని? 

అంతేకాదు!! ఇతర పంటలకు మరో రూ.8,200 కోట్లు వెచ్చించగా... దాన్లో పత్తి పంట కోసమే రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందనేది కాదనలేని వాస్తవం. పంటల కొనుగోలుకు 6400 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి కారణంగా రూ.600 కోట్ల నష్టం వచ్చినా... రైతుకు నష్టం రాకూడదని తపన పడ్డ ప్రభుత్వం ‘ఈనాడు’కు కనపడదెందుకు? గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు, రూ.9000 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల్ని ఈ ప్రభుత్వం భరించటం నిజం కాదా?

మిల్లర్ల ప్రమేయం ఎక్కడైనా ఉందా?
రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఎక్కడుందసలు? గతంలో రాజ్యమంతా దళారులదే కదా? వారి చెప్పుచేతల్లో రైతు మోసపోవటమే కదా? నకిలీ విత్తనాలు, ఎరువుల నుంచి మొదలెడితే... అప్పులిచ్చి వడ్డీ కింద పంటను జమ చేసుకోవటమనే దౌర్భాగ్య పరిస్థితులను ఏనాడైనా ప్రశ్నించారా? ఇప్పుడు మోసాలకు తావు లేకుండా ఆర్‌బీకేల ద్వారానే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ రైతుకూ దక్కని భరోసా 10,778 ఆర్‌బీకేలతో ఇక్కడ దక్కుతోంది.

ముఖ్యమైన డీలర్లంతా అనుసంధానమై ఉన్నారు కనక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఆర్‌బీకేలతోనే అందుతున్నాయి. గ్రామ స్థాయిలో... విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ అమల్లోకి వచ్చినా మరి శవాలపై పేలాలేరుకునే రీతిలో ఈ రాతలెందుకు? దీనికి జవాబొక్కటే. అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  ప్రజాభిమానం పుష్కలంగా ఉంది. కాబట్టి ప్రతిదీ భూతద్దంలో చూపించి విషం కక్కాలి.  ఇదే రామోజీ అజెండా. అందులో భాగమే ఈ అబద్ధపురాతలు.  

100 శాతం ఈ క్రాపింగ్‌..
ఇపుడు పంటలకు సంబంధించిన వివరాల్లో చిన్నచిన్న మోసాలక్కూడా ఎలాంటి తావూ లేదు.  నూరు శాతం ఈ–క్రాపింగ్‌. అంటే ప్రతి ఎకరం పారదర్శకం. ఎక్కడ.. ఏ రైతు... ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడన్నది ఈ–క్రాపింగ్‌తో సుస్పష్టం. ప్రతి ఒక్క ఎకరా నమోదవుతున్నది కాబట్టి సున్నా వడ్డీ, పంటల బీమా, పంటల కొనుగోలు అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అదే గతంలో బీమా చేయించాలంటే... పంట రుణం తీసుకున్న వారికి మాత్రమే బ్యాంకులు బీమా చేసేవి. అది కూడా 95 శాతానికే బీమా. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు.

పంట రుణాలతో సంబంధం లేకుండా అందరికీ నూరు శాతం ఉచితంగా బీమా లభ్యమవుతోంది. ఇక రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించటం నుంచి వ్యవసాయ విద్యతో పాటు తగిన సలహాలివ్వటం.. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల కోసం కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయటం కూడా ఆర్‌బీకేలతో సాధ్యమవుతోంది. అంటే.. ఆర్‌బీకేల సారథ్యంలో వరి ధాన్యం మాత్రమే కాక... అన్ని పంటల కొనుగోలుకూ పక్కా వ్యవస్థ రూపుదిద్దుకుంది. బలంగా వేళ్లూనుకుని ఎదుగుతోంది.

మిల్లర్ల జోక్యం లేదు. రైతులతో వారికి సంబంధమే లేదు. ధాన్యాన్ని ఆర్‌బీకేల్లో కొనుగోలు చేశాకే మిల్లర్లు రంగంలోకి వస్తున్నారు. ఇక వైఎస్సార్‌ జలకళ పేరిట రైతులకు ఉచితంగా బోర్లు కూడా తవ్విస్తున్నదీ ప్రభుత్వమే. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ‘ఈనాడు’కు ఏనాడూ కనిపించవెందుకు?

విద్యుత్‌ గురించి పట్టించుకున్నారా?
విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోలు మాత్రమే కాదు. వీటన్నిటికీ మూలమైన విద్యుత్‌ సరఫరాపైనా ముఖ్యమంత్రి మొదట్లోనే దృష్టి సారించారు. చంద్రబాబు హయాంలో 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ గురించి ఆలోచించిన దాఖలాలే లేవు. ఎందుకంటే అప్పట్లో ఒకవేళ ఇవ్వాలనే ఆలోచన వచ్చినా... ఇచ్చే వ్యవస్థ లేదు. ఫీడర్లు మొత్తం దెబ్బతిని వ్యవస్థ కునారిల్లి ఉంది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యాల్లో భాగంగా రూ.1,750 కోట్ల వ్యయంతో ఫీడర్ల వ్యవస్థను చక్కదిద్దారు.

దీంతో పగటిపూట రైతుకు నిరాటంకంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వటం సాధ్యమవుతోంది. అంతేకాదు. అప్పట్లో యూనిట్‌ రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేలా చంద్రబాబు పీపీఏలు చేసుకుని ప్రయివేటు కంపెనీలకు ముడుపుల కోసం దోచిపెడితే... పారదర్శకంగా యూనిట్‌ రూ.2.49కే ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచే కొనుగోలు చేస్తున్న చరిత నేటి ప్రభుత్వానిది. కాకపోతే దీన్లో కూడా ‘ఈనాడు’కు వ్యతిరేక కోణమే కనిపిస్తోందన్నది వేరే సంగతి.  

ఇదీ... ఈనాడు రాతల కథ  
‘ఈనాడు’ రాతలెంత అబద్ధాలో చెప్పటానికిదో ఉదాహరణ. శనివారంనాటి ‘ఈనాడు’ కథనంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని టి.నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు రాశారు. నిజానికి ఆయన రైతే కాదు. ఆయన పుట్టా నాగప్రసాద్‌ దగ్గర పనిచేస్తున్నాడు. నాగప్రసాద్‌ చాన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఖరీఫ్‌లో 23 ఎకరాల్లో వరి సాగు చేశారు. 15 రోజుల క్రితం కోతలు కోయించారు. అదే సమయంలో వర్షాలు రావటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆర్బీకేకు సమాచారమిస్తే వ్యవసాయాధికారులు వచ్చి పంటను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం కోసం రాసుకొని వెళ్లారు. ఆర్బీకే ద్వారా మంచి రేటుకు ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టుకున్నా. ఆర్బీకే సిబ్బంది వచ్చి చూసి తడిసిన ధాన్యాన్ని విడతల వారీగా సేకరిస్తున్నారు.

ఉచితంగా ఇచ్చిన గోతాముల్లో నింపి రావులపాలెం మిల్లుకు తరలిస్తున్నారు. ధాన్యం ఒబ్బిడి చేసి సంచుల్లో ఎక్కిస్తుండగా ‘ఈనాడు’ వాళ్లు వచ్చి అక్కడ పనికోసం వచ్చిన టేకి నాగేశ్వరరావు(కూలీ)ను ఆరా తీసారు. వర్షం వల్ల తడిసి రంగు మారింది. ఈసారి మంచి రేటు రావడం కష్టమే అన్నాడు. అతను నిజంగా రైతా..ఆ పొలం అతనిదా..కాదా అని కనీసం తెలుసుకోకుండా తమకనుకూలంగా రాసుకొని వెళ్లిపోయారు. ఆ బురద ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. అసలు ఈనాడు వాళ్లు తనతో మాట్లాడనే లేదని రైతు నాగప్రసాద్‌ ‘సాక్షి’తో వాపోయాడు. ఇదీ కథ. 

ఇలాంటి వ్యవస్థ ఎన్నడూ లేదు: కన్నబాబు 
ఈ–క్రాపింగ్‌ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఎకరంలో రైతులు ఏ పంట వేశారో ప్రభుత్వానికి తెలుసు. దీనికి కేవైసీ కూడా అనుబంధమై ఉంది కనక డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకే వెళతాయి. ఇతర రాష్ట్రాల నుంచి మోసపూరితంగా తెచ్చి ఇక్కడ విక్రయించే పద్ధతికి అడ్డుకట్ట వేశాం. రీసైక్లింగ్‌ను నివారించాం. నేరుగా రైతు మాత్రమే లబ్ధి పొందాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్దేశం. దానికి పక్కా వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ ఏడాది దురదృష్టవశాత్తూ తుపాన్ల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యం కొందరు రైతుల వద్ద ఉంది. దీన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవంక కోరుతూనే... ఇక్కడ కూడా కొనుగోలు మొదలుపెట్టాం.

కేంద్రం ప్రకటించిన 23 పంటలే కాక.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అరటి, బత్తాయి వంటి మరో 7 పంటలకూ కనీస మద్దతు ధర కల్పించాం. పొగాకు కొనుగోళ్లలో కార్పొరేట్లు రైతులను దెబ్బతీస్తున్న పరిస్థితి చూసి గతేడాది ముఖ్యమంత్రి ఆదేశాలతో మేమే వేలంలో పాల్గొన్నాం. ఐటీసీ వంటి దిగ్గజాలతో పోటీపడి రూ.130 కోట్లు వెచ్చించి పొగాకు కొన్నాం. ఒక్కటి మాత్రం నిజం!!. రైతులను వారి మానానికి వారిని వదిలేయకూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం. అందుకే పెసలు, సజ్జలు కూడా కొంటున్నాం. మూడు వారాల్లో ధర చెల్లిస్తున్నాం. వీటన్నిటినీ వదిలి ఒకటి రెండు చోట్ల ఉన్న పరిస్థితిని ‘ఈనాడు’ భూతద్దంలో చూపిస్తోంది. అది వారి కడుపు మంటకు నిదర్శనమని చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement