సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండానే ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చారని అంబటి పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
గతంలోనూ చాలాచోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని.. నిమ్మగడ్డ మాత్రం ఎందుకు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆంక్షల నేపథ్యంలో అంబటి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు సరికావని ఆయన అన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని అంబటి గుర్తుచేశారు.
ఇది దుర్మాగం
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీ ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సాలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధుల హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మండిపడ్డారు. మా హక్కులకు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment