
సాక్షి, తాడేపల్లి: ‘అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉంది. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుది. సీబీఐ రాష్టానికి రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు నేడు సీబీఐ విచారణ కోరుతున్నారు. మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు’ అన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వైఎస్సార్ ఆసరా పథకం గురించి మాట్లాడుతూ.. ‘డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నేడు పండగ రోజు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు. మహిళలు కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. 90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్పప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగనన్నకు తెలియదు’ అన్నారు రోజా. (చదవండి: ‘మాకు చిరకాలం మీరే సీఎంగా ఉండాలి’)
ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలు, విద్యార్థులు కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ఆడవారికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి మహిళలు అందరూ రుణపడి ఉంటారు. మహిళలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రజలను తమ సొంత కుటుంబ సభ్యులుగా జగన్‌మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు. స్త్రీల ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తున్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. ఆడవారి కోసం చంద్రబాబు ఒక మంచి పథకం కూడా ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్ ఆసరా మీద చంద్రబాబు నిందలు వేస్తున్నారు. కులాలు, మతాలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు’ అని ప్రశంసలు కురిపించారు.