సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దళిత ద్రోహి అని వైఎస్సార్‌సీపీ దళిత నేతలు మండిపడ్డారు. దళితులకు చంద్రబాబు చేసిన మోసంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వైస్సార్సీపీ నేతలు పాలాభిషేకాలు చేసి వినతి పత్రాలు సమర్పించారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండగా ఏనాడు దళితులను చంద్రబాబు పట్టించుకోలేదని దళిత నేతలు ధ్వజమెత్తారు. దళితులకు దక్కాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. (చదవండి: జగన్‌ను దళితులకు దూరం చేయాలని కుట్ర)
‘‘అధికారం పోయాక దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారు. అమరావతిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు. దళితులు ఇంగ్లీషు మీడియం చదవకుండా అడ్డుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు నోరు మెదపలేదని’ దుయ్యబట్టారు. (చదవండి: చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదు)
దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ చంద్రబాబు అవమానించారని దళిత నేతలు గుర్తు చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు పాలాభిషేకం చేసి, వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు, గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా: ఎస్సీలకు చంద్రబాబు చేసిన మోసంపై పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నాలుగు రోడ్లకూడలిలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖపట్నం: దళితులపై చంద్రబాబు కపట ప్రేమకు నిరసనగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, చెట్టి ఫాల్గుణ, నార్త్ కన్వీనర్ కేకే రాజు, విశాఖ నగర ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ కార్యదర్శి రొయ్య వెంకటరమణ పాల్గొన్నారు.
దళితులకు పూర్తి రక్షణ..
ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకు పూర్తి రక్షణ ఉందన్నారు. దేశ చరిత్రలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు తన పాలనలో సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. శిరో ముండనం కేసులో ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని.. దళితులు నమ్మే స్థితిలో లేరని మంత్రి పేర్కొన్నారు.
కులాల మధ్య చిచ్చు..
కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మండిపడ్డారు. జనం ఛీ కొట్టినా చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆపడం లేదని దుయ్యబట్టారు. దళితులపై దాడి జరిగితే జూమ్ లో పరామర్శిస్తారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఇది పేదలు, బలహీనవర్గాల ప్రభుత్వం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దళితులు, అగ్రవర్ణాలు అన్న తేడా లేదని.. ఇది పేదలు, బలహీనవర్గాల ప్రభుత్వం అని నార్త్ కన్వీనర్ కేకే రాజు అన్నారు. అన్ని వర్గాలు కలిసి ఐక్యంగా ఉండటాన్ని చూడలేక చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కుల రాజకీయాలకు నిరసనగా..
చంద్రబాబు కుల రాజకీయాలకు నిరసనగా గాజువాకలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, యువజన నాయకుడు రేవంత్ రెడ్డి, దళిత సంఘాల ప్రతినిధి పరదేశి, కోళ్లు దేవుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక రాజకీయాలపై అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు ఆపాలంటూ అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ విభాగం నేతలు నిరసనకు దిగారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. అందుకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారని.. టీడీపీ నేతలు దాడులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment