ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న బంధువులు (ఇన్‌సెట్)స్వర్ణకుమారి (ఫైల్)
ప్రొద్దుటూరు క్రైం : ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కుమారుడిని చూడకనే కన్నుమూసింది. మహిళా పోలీసు స్వర్ణకుమారి (33) ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించి కొద్ది సేపటి తర్వాత మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులు, ఆస్పత్రి వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన బాబు చేనేత పని చేసుకొని జీవనం సాగించేవాడు. ఆయన భార్య స్వర్ణకుమారికి 2019లో కొండాపురం మండలంలోని చౌటపల్లె సచివాలయంలో మహిళా పోలీసుగా ఉద్యోగం వచ్చింది. దీంతో వారు కొండాపురం మండలానికి కాపురం మార్చారు. వారికి మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. రెండో కాన్పు కోసం గురువారం ప్రొద్దుటూరులోని కాత్యా నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. డాక్టర్ సిజేరియన్ చేశాడు. మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆపరేషన్ తర్వాత ఆమెకు అధిక రక్తస్రావం జరిగింది. ముగ్గురు వైద్యులు కలిసి చికిత్స చేయడంతో రక్తస్రావం ఆగింది. కొద్ది సేపటి తర్వాత రెండో సారి బ్లీడింగ్(రక్తస్రావం) కావడంతో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. రెండు ఆపరేషన్ల కోసం సుమారు ఏడు యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. మూడో సారి రక్తస్రావమైతే ప్రమాదకరమని భావించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లాలని సూచించారు. గురువారం రాత్రి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో పులివెందుల సమీపంలోకి వెళ్లగానే మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. స్వర్ణకుమారి బంధువులు శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆరోపించారు. విషయం తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మా నిర్లక్ష్యం లేదు
స్వర్ణకుమారి ఏడవ నెల వరకు వేరే ఆస్పత్రిలో చూపించుకున్నట్లు డాక్టర్ కాత్యా తెలిపారు. ఎనిమిదవ నెలలో తమ ఆస్పత్రికి వచ్చిన ఆమెను పరీక్షించగా మాయ కిందికి ఉండటంతో రిస్క్ ఎ క్కువగా ఉంటుందని ముందే తెలిపామన్నారు. సిజేరియన్ చేసిన తర్వాత అధిక రక్తస్రావం కా వడంతో, రెండో సారి ముగ్గురు వైద్యులు ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించామన్నారు. మూ డోసారి బ్లీడింగ్ అయితే ప్రమాదకరమని భావించి ముందు జాగ్రత్తగా బెంగళూరుకు వెళ్లాలని సూచించామని తెలిపారు. అక్కడికి వెళ్తున్న సమ యంలో మార్గంమధ్యలో గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఆపరేషన్ చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment