
మదనపల్లెలో జరిగిన రాజ్యాంగరక్షణ సభలో పాల్గొన్న ప్రజాయుద్ధనౌక గద్దర్ (ఫైల్)
మదనపల్లె: ప్రజా యుద్ధనౌక, ప్రజాగాయకుడు గద్దర్‌కు మదనపల్లెతో విడదీయరాని అనుబంధం ఉంది. పట్టణంలో భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం జరిగిన రాజ్యాంగ రక్షణ సభ, విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే పార్టీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన రాజ్యాంగరక్షణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో జరిగిన మునికృష్ణారెడ్డి అవార్డుల ప్రదానసభలోనూ పాల్గొన్నారు. పట్టణానికి చెందిన బాస్ వ్యవస్థాపకులు పీటీఎం.శివప్రసాద్, ఇతర ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, విద్యావంతులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గుమ్మడి విఠల్‌రావు అలియాస్ గద్దర్(77) కన్నుమూశారన్న వార్త తెలిసిన వెంటనే పట్టణం శోకసంద్రంలో మునిగిపోయింది. పట్టణంలో ఆయన పాల్గొన్న సభలకు హాజరైనవారు, ఆయన పాటలను, కళాప్రదర్శనలు చూసినవారు అప్పటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఎంతోమందిని ఉత్తేజపరిచి.. ఉద్యమం ఉధృతం కావడానికి ఊపిరి పోసిన గద్దర్... మదనపల్లెలో జరిగిన రెండు రాజ్యాంగరక్షణ సభలోనూ తనదైన శైలిలో ఆటపాటలతో ప్రజలను అలరించారు. రాజ్యాంగం విశిష్టతను తెలుపుతూ, సమాజంలో వేళ్లూనుకుపోయిన నిచ్చెనమెట్లు, అస్పృశ్యతలపై తానే అభినయిస్తూ..తన గొంతుకతో స్థానికుల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు.
వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రథమ మహాసభలో భాగంగా ఏప్రిల్ 8న మదనపల్లెలో నిర్వహించిన సమావేశంలో గద్దర్, విమల దంపతులు సన్మానంతో పాటు డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి స్మారక సత్కారాలను అందుకున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ప్రగాఢ సంతాపం తెలిపారు. జానపద కళారూపాలకు విప్లవ సాహిత్యాన్ని జోడించి ప్రజా సంస్కృతికి పట్టం కట్టారన్నారు. గద్దర్ మృతి అభ్యుదయ, సాహిత్య లోకానికి, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు అని అన్నారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment