ఆమెకు 35.. అతనికి25: ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను.. | Wife Kills Husband With The Help Of Her Lover Over Extra Marital Affair In Madanapalle - Sakshi
Sakshi News home page

ఆమెకు 35.. అతనికి25: ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను..

Published Tue, Oct 31 2023 1:08 AM | Last Updated on Tue, Oct 31 2023 6:58 PM

- - Sakshi

అన్నమయ్య: ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను భార్య అంతమొందించిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. కాగా అతిగా మద్యం తాగిన భర్త ఇంటి ముందు పడి చనిపోయాడని నమ్మించే యత్నం చేసింది. పాచిక పారకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి ప్రియుడితో సహా భార్య పోలీసులకు చిక్కింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం ఎర్రకోటపల్లె పంచాయతీ సింగనొడ్డుపల్లెకు చెందిన రఘునాథ్‌, నారాయణమ్మ దంపతుల రెండో కుమారుడు డి.వెంకటశివ(42) రెండేళ్ల నుంచి తన భార్య రమణమ్మ(35)తో కలిసి మదనపల్లె రామిరెడ్డిలేఅవుట్‌ వినాయకుని గుడి వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

వీరికి ఒక కుమార్తె కాగా ఆమెకు వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక టమాట మార్కెట్‌యార్డులో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో రమణమ్మ స్థానికంగా ఉంటున్న మరో యువకుడు గగన్‌(26)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లిన వెంకటశివ భార్య రమణమ్మతో గొడవపడ్డాడు. దీంతో ఆమె ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని, ఇంట్లోని రోకలిబండతో తలపై మోదింది. దీంతో వెంకటశివ అపస్మారకస్థితిలోకి వెళ్లగా.. ప్రియుడు గగన్‌తో కలిసి వైర్‌ సాయంతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా... భర్త తరఫు బంధువులకు ఫోన్‌ చేసి అతిగా మద్యం తాగి ఇంటి వద్దకు వచ్చి కిందపడి చనిపోయాడని సమాచారం అందించింది.

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తున్నట్లుగా తెలిపింది. రాత్రికి రాత్రి స్థానికుడైన ఆటోడ్రైవర్‌ రవిని పిలిచి చనిపోయిన విషయం దాచిపెట్టి, భర్త తాగిపడిపోయాడని, ఇంటికి తీసుకెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా కోరింది. సింగనొడ్డుపల్లెకు మృతదేహాన్ని తీసుకెళ్లింది. అక్కడ వెంకటశివ మృతదేహాన్ని పరిశీలించిన అతడి కుటుంబ సభ్యులు తలపై, మెడపై గాయాలను గమనించి, భార్య రమణమ్మను నిలదీశారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు కలకడ పోలీసులకు సమాచారం అందించారు.

కలకడ పోలీసులు హత్య సమాచారాన్ని మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్‌ సీఐ మహబూబ్‌బాషా మృతుడి స్వగ్రామం సింగనొడ్డుపల్లెకు వెళ్లి మృతదేహాన్ని, శరీరంపై గాయాలను పరిశీలించి, హత్య జరిగినట్లుగా నిర్ధారించుకున్నారు. శవ పంచనామా పూర్తిచేసి, మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు కారకులైన నిందితులు రమణమ్మ, గగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహబూబ్‌బాషా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement