మా బిడ్డను కాపాడండయ్యా.!
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన నాయనపల్లి హరిప్రసాద్, స్వర్ణలత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు నవీన్ తేజ (14) పుట్టిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాదులోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెలో రంధ్రం ఉందనడంతో ఆందోళన చెందారు. పది కిలోల బరువు ఉంటేనే శస్త్ర చికిత్స చేసేందుకు వీలవుతుందని చెప్పడంతో వెనక్కు వచ్చారు. తిరిగి ఏడేళ్ల అనంతరం నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గుండెలో రక్త ప్రసరణ సరిగా లేదని, ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరుతుందని, అవయవాలు సైతం దెబ్బతిన్నాయని శస్త్ర చికిత్స చేయలేమని, చేసినా ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుంచి కేవలం మందులతోనే నెట్టుకొస్తున్నారు. నవీన్ తేజ గత ఏడాది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సమయంలో తలనొప్పితో బాధపడుతూ కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా మెదడులో కణతి ఉందని చికిత్స చేశారు. అయినా నాలుగు అడుగులు నడిచినా ఆయాసంతో పడిపోతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులకు వెళితేనే గాని తమకు పూట గడవదని, అలాంటిది తమ కుమారుడి మందులకు నెలకు రూ. 6 వేలు వరకు ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు పది లక్షల రూపాయల వరకు అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగామని, ప్రస్తుతం ఆర్థిక స్థోమత లేకపోవడంతో మందులుసైతం కొనలేని దుస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల తమ కుమార్తె ఆరోగ్యం కూడా బాగోలేదని ఆసుపత్రుల వెంట తిరుగుతూ కూలి పనులకు వెళ్లలేక వేదనతో బతుకీడుస్తున్నామని చెబుతున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించి తమ కుమారుడిని కాపాడాలని, ప్రభుత్వం పింఛను అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
అనారోగ్యంతో అల్లాడుతున్న బిడ్డను ఆదుకోవాలని వేడుకోలు
మందులకు డబ్బులు లేక
తల్లిదండ్రుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment