గిరిజన మహిళపై దాడి హేయమైన చర్య
మదనపల్లె : గిరిజన మహిళ అలివేలమ్మ పై జరిగిన దాడి హేయమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. అగ్రవర్ణాల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సీపీఎం నాయకులు హరింద్రనాథ్ శర్మ, నాగరాజు, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపకుడు కోనేటి దివాకర్, బాస్ నేత ముత్యాల మోహన్ లు మంగళవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కన్వీనర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ అలివేలమ్మ ఒకే కుటుంబం శీలంవారిపల్లిలో ఉంటోందన్నారు. ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని దురుద్దేశంతో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అకారణంగా గొడవ పెట్టుకుని ఆమెను వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. దాడిని అడ్డుకోబోయిన కోడలు బాలింత అని కూడా చూడకుండా దాడి చేయడం దుర్మార్గమన్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు. గుర్రంకొండ ఎస్‌ఐను వెంటనే సస్పెండ్ చేసి డీఎస్పీ స్థాయి అధికారిని విచారణకు ఆదేశించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ప్రజలపై చిన్నచూపు తగదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన కూడా పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment