ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం | Kurnool Ayyakonda Village Not Use Bed And Tombs In Village | Sakshi
Sakshi News home page

ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం

Published Sat, Oct 9 2021 8:40 PM | Last Updated on Sun, Oct 10 2021 2:27 PM

Kurnool Ayyakonda Village Not Use Bed And Tombs In Village - Sakshi

సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్‌): ఏ ఊరిలోనైనా సాధారణంగా సమాధులు ఊరికి దూరంగా ఉంటాయి. ఇంట్లో గతించిన వారిని స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపి, కొన్నాళ్ల తరువాత సమాధి కడుతారు. ప్రపంచంలోని ఏ ఊరిలోనైనా ఈ ఆచారం కొనసాగుతుంది. చనిపోయిన వారి కోసం ఊరి చివర ఒక ప్రత్యేక స్మశాన వాటిక ఉండడం సాంప్రదాయం. కానీ ఇంటికి ముందే గతించిన వారి సమాధి ఉండడం, వారం వారం వాటికి పూజలు చేయడం ఆ ఒక్క ఊరిలోనే కనిపించే ఆచారం. గతించిన వారి ఆత్మల సన్నిధిలో తాము నివసించాలని, ఆ ఆత్మల ఆశీస్సులే తమకు అపురూపమని భావిస్తారు ఆ గ్రామ ప్రజలు.

అంతేకాదు.. తమ చింతలన్నింటినీ రూపుమాపి, తమ బ్రతుకులకు ఉత్సాహాన్ని నింపే స్వామి ‘చింతల మునిస్వామి’ అని భావిస్తూ తమ ఇంట్లో వండిన ప్రతి వంటకాన్ని ముందుగా ఆ స్వామికి నైవేధ్యంగా అందిస్తారు ఆ గ్రామస్తులు. తమ ఊరికి సమీపంలో ఉండే గంజిహళ్లి గ్రామ బడేసాహెబ్‌ వలి తాత పెట్టిన శాపంతో ఆ ఊరు మంచం లేని వింత ప్రపంచంగా మారింది. చిత్రం ఏమిటంటే ఏ ఇంటిలోనూ మనకు మంచమే అగుపించదు. నేలనే పాన్పుగా భావించి, నేలపై నిదురించే ఆ గ్రామవాసులు తమ ఇంటి ముందున్న సమాధులే తమకు శ్రీరామ రక్షగా భావిస్తుంటారు. 

స్మశానవాటిక లేని, మంచం వాడని, వింత ఆచారాలు కలిగి, సమాధులే అండదండగా భావిస్తోంది అయ్యకొండ గ్రామం. ఏడు తరాలుగా నిరంతరాయంగా, క్రమం తప్పకుండా ఈ ఆచారాలు పాటిస్తున్న ఆ గ్రామ వాసులను పలుకరిస్తే.. తాము నమ్మిన ఆచారాలను పాటించడంలోని ఒక చిత్తశుద్ధి, ఒక నియమపాలన కనిపిస్తుంది. వాటిపై ప్రత్యేక కథనం...

గ్రామం గురించి..
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉంది అయ్యకొండ గ్రామం. కర్నూలుకు 61కిలో మీటర్లు దూరం ఉన్న ఈ గ్రామంలో 254 కుటుంబాలుండగా 1426 జనాభ ఉంటుంది. పురుషులు–768, స్త్రీలు–658 ఉన్నారు. ఊరంతా మాల దాసరి (ఒకే) కులం.

గ్రామస్తులు చెప్పే చరిత్ర
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అయ్యకొండ గ్రామంలో ‘శ్రీ చింతల మునిస్వామి’ ఆలయం ఉంది. అక్కడి పెద్దల అభిప్రాయాల ప్రకారం... మూడున్నర శతాబ్ధాల క్రితం అయ్యకొండపై (అప్పట్లో ఊరు లేదు) చింతల మునిస్వామి తాత ఉండేవారు. ఇక్కడికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గంజిహళ్లి గ్రామంలో పెద్ద భూస్వామి ఇంట్లో ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా ఉండేవారు. ఓ రోజు యజమాని ఒక ఆవును తీసుకెళ్లి  తన కూతురుకు ఇచ్చిరావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించారు. దీంతో ఆవును తీసుళ్తుండగా అది తప్పించుకొని వెళ్లిపోడంతో యజమాని ఆగ్రహించి, ఆవును వెతుక్కొని తేవాలని ఆదేశిస్తారు. 

దీంతో ఎల్లప్ప అడవిలో వెతుక్కుంటూ కొండపైకి వెళ్తారు. అక్కడ రాళ్ల గుహలో శబ్ధం రాగా రాళ్ల చాటు నుంచి తొంగి చూస్తారు. అక్కడ కూర్చున్న చింతల మునిస్వామికి తప్పించుకుపోయిన ఆవు పితకకుండానే పాలు ఇస్తుండడం, మునిస్వామి తాత దోసిలి పట్టి పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఎల్లప్ప. ఇది చూసి తాత శక్తులు కలిగిన స్వామిగా భావించి భూస్వామి వద్ద పని మానేసి.. మునిస్వామి చెంతకు చేరి సేవలు చేసుకుంటూ ఉండిపోతారు.

ఇళ్ల మధ్యే సమాధులు
చింతల మునిస్వామి వద్ద సేవలు చేస్తూ జీవిస్తున్న ఎల్లప్ప కుమారుడు బాల మునిస్వామి చనిపోయిన తరువాత తన ఇంటి ముందే సమాధి చేస్తారు. ప్రతి శనివారం ఆ సమాధికి ఆవు పేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించారట. కుటుంబాలు పెరుగుతూ పోవడం, ఆయుష్షు తీరి చనిపోయిన వారిని ఇళ్ల ముందే అంత్యక్రియలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.

వండిన వంట మునిస్వామి చెంత
ఆ రోజుల్లో చింతల మునిస్వామి తాత వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప తినడానికి సమీపంలోని గ్రామాలకు వెళ్లి అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామి చెంత ఉంచి, పూజించిన తరువాతే భుజించేవారట. అన్నంతో పాటు ఏ వంట అయినా ఇలా చేసేవారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వంశీయులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. 

అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం, తీపి వంటలు.. ఇలా ఏ వంట వండినా ముందుగా చింతల మునిస్వామి ముందు పూజించిన తరువాతే నోటిలో పెట్టుకుంటున్నారు. అత్త ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆమెకు తెలియకుండా కోడలు చేసుకున్న వంట సైతం ఆలయంలోకి తీసుకెళ్లాలి. ఆమె వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరితోనైనా పంపించి, పూజ చేయించిన తరువాతే తినాలి. చివరకు మద్యం, సారా, కల్లు ఇలా ఏమి తాగాలన్నా తాత ముందు పూజ చేయాల్సిందే.

మంచం వాడని వింత ప్రపంచం
మంచం వాడని వింత ఊరుగా అయ్యకొండకు పేరు. గంజిహళ్లి బడేసాహెబ్‌ తాత, చింతల మునిస్వామి తాత ఇద్దరు స్నేహితులు. గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరుణాలకు ఆహ్వానించగా బల్లి రూపంలో వస్తారు బడేసాహెబ్‌ తాత. ఇది గ్రహించని మునిస్వామి తాత మంచంపై కూర్చొని ఉండి తిరుణాలకు రాలేదని బడేసాహెబ్‌ తాతపై కోప్పడుతారట. అప్పుడు ప్రత్యక్షమైన బడేసాహెబ్‌ తాత మంచంపై కూర్చున్న నువ్వు.. నేను వచ్చినా గ్రహించకుండా కోపగించుకుంటావా అని ఆగ్రహించి ‘మాల వాడికి మంచం లేదు.. నువ్వు మంచం వాడరాదని’ శపించారట. తాత మంచం వాడలేదని ఆ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మనిషి పుట్టిన తరువాతే ఆచారాలు పుట్టాయి. అయితే వాటి ప్రభావం మనుషులపై ఎంతో ఉంటుంది. ఆనాదిగా వస్తున్న ఆచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలను మనిషి ఎంతో విశ్వాసం కలిగి ఉంటాడు అనడానికి ఇవే నిదర్శనం.

ఏడు తరాలుగా ఇవే ఆచారాలు : పెద్ద రంగన్న, అయ్యకొండ.
ఏడు తరాలుగా మా కులదైవం శ్రీ చింతల మునిస్వామి తాతను ఆరాధిస్తూనే వస్తున్నాం. అప్పటి నుంచి ఏ వంట చేసినా ముందుగా తాత పాదాల చెంత ఉంచి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోం. తరాలు మారినా మా ఆచారాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిని కాదనే ఇళ్లు, మనిషి మా గ్రామంలోనే లేరు.

స్మశానం ఉండదు.. ఇంటి ముందు సమాదులు : చిట్టెమ్మ
గ్రామానికి ప్రత్యేకంగా స్మశానం ఉండదు. ఎవరు చనిపోయినా ఇంటి ముందు లేదా పక్కన ఖాళీ స్థలంలోనే అంత్యక్రియలు జరుపుతారు. వాటి మధ్యే మా జీవనం. ప్రతి శనివారం వాటిని శుభ్రం చేసి అగరొత్తులు వెలిగించి పూజించడం తరాలుగా వస్తున్న ఆచారాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం వాటి మధ్యే ఆడుకోవడం చేస్తుంటారు.

ఏ వంట చేసినా తాతకు ముందుగా నైవేద్యం : నాగమ్మ
మా గ్రామంలో వస్తున్న ఆచారాలను ఇప్పటికీ ఎవరూ కాదని వెళ్లరు. ఏ వంట చేసినా ముందుగా చింతల మునిస్వామి తాత చెంత పెట్టాలి. అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, పిండి వంటలు, చివరకు గుడ్డుతో ఆమ్లెట్‌ వేసుకున్నా నైవేధ్యంగా పెట్టి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోము. రోజుకు పది రకాల వంటలు, పది సార్లు వండినా తాతకు పెట్టాల్సిందే.

కటిక నేలపైనే కాన్పు : శంకరమ్మ
మా గ్రామంలో మంచం వాడరాదనే శాపం ఉంది. దీంతో ఊరిలోని ఏ ఇంట్లో చూసినా మంచం ఉండదు. నేలపైనే నిద్రిస్తాము. చివరకు కాన్పు జరిగినా కటిక నేలపైనే. పచ్చి బాలింత అయినా బొంత పరుచుకొని తల్లి, పిల్లలు కింద పడుకోవాలి తప్ప ఏ మంచాన్ని వాడరు. దీనిని ఎవరూ కాదనరు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement