సాక్షి, శ్రీశైలం: విభూది సంపదను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలను భస్మం చేస్తుంది. అరిష్టాలన్నింటిని తొలగిస్తుంది. సమస్త శుభాలను కలిగిస్తుంది. సర్వసంపదలను చేకూరుస్తుంది. తేజస్సును కలిగిస్తుంది. మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి సద్గుణాలను ప్రసాదించే విభూదిని ధరించడం శుభప్రదమని పురాణాలు పెర్కొంటున్నాయి. అంతటి సుగుణాలను, పవిత్రతను కలిగిన విభూదిని శ్రీశైల దేవస్థానం తయారు చేస్తుంది. విభూది విక్రయాల ద్వారా దేవస్థానానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది.
చదవండి: (రాకెట్ ఇంధనం తణుకు నుంచే...)
శ్రీశైల మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు స్వామి విభూదిని పరమ పవిత్రంగా భావిస్తారు. దేవస్థానం కూడా గోమయంతో స్థానిక గోశాలలో నిష్టగా తయారు చేయించి విక్రయిస్తుంది. విభూది విక్రయాల ద్వారా దేవస్థానానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విభూది భక్తితో పాటు క్షేత్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా మారింది. క్షేత్రానికి వచ్చే భక్తులకు దేవస్థానం స్వచ్చమైన గోమయంతో తయారు చేసిన దివ్యపరిమళ విభూదిని అందుబాటులో ఉంచింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో విభూదిని తయారు చేస్తుంది. తయారీలో శాస్త్రోక్తంగా, ప్రమాణాలు పాటిస్తున్నారు.
విభూది తయారీ ఇలా..
దేవస్థానం గోశాల నుంచి లభించే గోమయం(ఆవుపేడ)ను పిడకలుగా చేసి ఎండలో ఆరబెడతారు. ఎండిన వాటిని కాల్చి తద్వారా వచ్చిన బూడిద(భస్మం)ను వడపోసి ప్రత్యేక యంత్రంలో వేస్తారు. వచ్చిన మిశ్రమాన్ని కేకులాగా తయారు చేసి మళ్లీ కాల్చుతారు. తద్వారా వచ్చే భస్మాన్ని విడతల వారీగా వడపోసి చివరికి విభూదిని తయారు చేస్తారు. అలాగే ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో రుద్రయాగం, చండీయాగంలోని భస్మాన్ని కూడా విభూది తయారులో వినియోగిస్తుండడంతో పవిత్రత చేకూరుతుంది. విభూది తయారు చేయడానికి 17మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
చదవండి: (వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్‌పోర్ట్)
ఆదాయ వనరు..
దివ్య పరిమళ విభూదిని ప్యాకెట్లు, డబ్బాల్లో దేవస్థానం విక్రయిస్తుంది. 10గ్రాముల విభూది డబ్బా రూ.10, 50గ్రాముల విభూది డబ్బా రూ.20, 75గ్రాముల విభూది డబ్బా రూ.30, 100గ్రాముల విభూది డబ్బా రూ.40, 50గ్రాముల విభూది ఉండా రూ.10, విభూది ప్యాకెట్లను రూ.10గా విక్రయిస్తున్నారు. కిలో విభూది ధర రూ.300గా నిర్ణయించారు. దీంతో ఆలయానికి విభూది విక్రయాల ద్వారా ఏటా రూ.లక్షల్లో ఆదాయం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment