
జీవ నియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలి
గుంటూరు రూరల్: రైతులు విచక్షణ రహితంగా వినియోగిస్తున్న ఎరువులు, పురుగు మందుల వల్ల సాగు ఖర్చు పెరుగుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి అన్నారు. రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలు, జీవనియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలని తెలిపారు. నగర శివారులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతు రక్షణ వేదిక ఆధ్వర్యాన మంగళవారం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎందుకు? ఎలా అనే అంశంపై చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అధిక రేటు, అధిక ఆదాయం ఇచ్చే పంటలను పండించాలని సూచించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరగాలని, విత్తన సాధికారత సాధించాలని, కౌలురైతులకు ప్రోత్సాహాలను కల్పించాలని, బయో డైవర్సిటీ, కమ్యూనిటీ సీడ్ డెవలప్‌మెంట్, పాతతరం విత్తనాలను సంరక్షించుకోవాలని, సుస్థిర వినియోగం, సాంప్రదాయ వ్యవసాయ విధానలు చేపట్టాలని సూచించారు. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్‌లు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు రైతులకు వెన్నంటి ఉండి సుస్థిర దిగుబడులకు దోహదం చేయాలని కోరారు. రైతులను సంఘటితం చేయాలని, యువతను వ్యవసాయంవైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎలా? ఎందుకు అనే అశంపై డాక్టర్ వేణుగోపాలరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు రక్షణ వేదిక ప్రతినిధి డాక్టర్ కె రాజమోహన్‌రావు, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ప్రొపెసర్ డాక్టర్ డి నరసింహారెడ్డి, సెంటర్ ఫర్ స్టెయినబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎస్‌బీపీజీఆర్ ప్రతినిధి డాక్టర్ బి శరత్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి