
ఈ బైక్ డిజైన్ పోటీల్లో ఆర్‌వీఆర్‌జేసీ ప్రతిభ
గుంటూరు రూరల్: తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ బైక్‌కు జాతీయస్థాయిలో అవార్డులతోపాటు, నగదు బహుమతులను సాధించటం సంతోషకరమని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. మంగళవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటీవల గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ యూనివర్సిటీలో ఐఎస్‌ఐఈ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఈపి ఈబైక్ డిజైన్ ఛాలెంజ్ (సీజన్ 5.0) జాతీయ స్థాయి పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ అవార్డు (రూ.30,000 నగదు బహుమతి), ఫ్యూచర్ అవార్డు (రూ.5,000 నగదు బహుమతి)లను గెలుచుకున్నారన్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్‌లు మాట్లాడుతూ ఇంధన కాలుష్యం నివారించేందుకు, ఐఎస్‌ఐఈ నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, తమ కళాశాల విద్యార్ధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం గర్వకారణమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాల అధ్యాపక నిపుణుల నేతత్వంలో ఈ–బైక్ వాహన తయారీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి 25 మంది విద్యార్థులతో కూడిన జట్టు పాల్గొన్నారన్నారు. ఈ–బైక్ ద్విచక్ర వాహన తయారీలో 60వి, 40 ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 60వి, 2కెడబ్ల్యూ బీఎల్‌డీసీ మోటార్‌ను, 4 కెడబ్ల్యూ కంట్రోలర్‌ను అమర్చడం జరిగిందన్నారు. ఒకసారి ఛార్జ్ చేసిన అనంతరం ఇది 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో సుమారు 90 నుండి 100 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక,ఆర్థిక సహాయాలను అందించడానికి కళాశాల యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. అవార్డులను పొందిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ కె చంద్రశేఖర్, డాక్టర్ డివివి కృష్ణప్రసాద్, పీ వెంకటప్రసాద్, పీ వెంకటమహేష్, ఆర్ మారుతీవరప్రసాద్, తదితరులు అభినందించారు.