
వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు మల్లేశ్వర ప్రాంగణంలో పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించి, పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు జరిపించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వార్ల ఉత్సవమూర్తులను వెండి పల్లకీపై ఉంచి నగరోత్సవ సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి వెండి పల్లకీ సేవ ప్రారంభం కాగా, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, భజన బృంద సభ్యులతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్ మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. పూజా కార్యక్రమాలు, నగరోత్సవ సేవలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉపప్రధాన అర్చకులు కోట ప్రసాద్ పాల్గొన్నారు.
వేడుకగా మంగళ స్నానాలు వెండి పల్లకీపై ఊరేగిన ఆదిదంపతులు

వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు