
మెరుగ్గా ‘చెత్త నుంచి సంపద సృష్టి’
సత్తెనపల్లి: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.అర్జునరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలోని ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అర్జునరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, క్లాప్ మిత్రాలు పారిశుద్ధ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కూడా ఇంటి వద్దనే తడి, పొడి చెత్తలను వేరు చేసి అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత కలిగి ఉండాలని కోరారు. అనంతరం నందిగామ క్లాప్ మిత్రాలతో సమావేశమై, పలు సూచనలు చేశారు. గ్రామంలోని ఏడు అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకు చెందిన స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్‌లతో ఈడీ భేటీ అయ్యారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం, నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో బండి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల విస్తరణాధికారి ఆర్.శ్రీనివాసరెడ్డి, నందిగామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఐటీసీ రీసోర్స్‌పర్సన్ చెంబేటి బొల్లయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ భావన, ఏపీఎం సమాధానం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.