
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పర్చూరు నేతలకు స్థానం
పర్చూరు(చినగంజాం): పర్చూరు నియోజక వర్గంలోని పలువురు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు జిల్లా కమిటీలో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ఆదేశాలు అందాయి. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పఠాన్ కాలేషావలి, ప్రధాన కార్యదర్శిగా కొండూరు గోవింద్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా దండా చౌదరి, కోట శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పి.రామకృష్ణారెడ్డి, పాలేరు వీరయ్యలు నియామకం కాగా జిల్లా అధికార ప్రతినిధిగా బండారు ప్రభాకరరావు నియమితులయ్యారు.
14న టెన్నిస్ బాల్ క్రికెట్
టోర్నమెంట్
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీ జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన అభ్యర్థులు రూ.999 ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. పోటీలో పాల్గొనే టీం సభ్యులు ఎవరు కిట్టు వారే తెచ్చుకోవాలని, బాల్ కమిటీ వారి వద్దే కొనుగోలు చేయాలని, ప్రతి మ్యాచ్లో 12 ఓవర్లు ఉంటాయని, ఒక జట్టులో ఆడిన సభ్యుడు మరొక జట్టులో ఆడరాదని వారు తెలిపారు. పోటీలో విజేతలైన మూడు టీం లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.30,116 రూ.20,116, రూ.10,116లు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 6303974120 నెంబర్లో సంప్రదించాల్సిందిగా తెలిపారు.
అద్దంకి కమిషనర్‌కు
బెస్ట్ కలెక్షన్ అవార్డు
అద్దంకి రూరల్: అద్దంకి మున్సిపాలిటీ జిల్లాలో అత్యధికంగా పన్ను వసూళ్లులో విశేషంగా కృషి చేసిన కమిషనర్ రవీంద్ర గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అడ్మినిస్టేటివ్ సెక్రటరీ చేతుల మీదుగా బెస్ట్ కలెక్షన్ అవార్డుతోపాటు మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
జాతీయ అవార్డుకు విద్యాశాఖాధికారి ఎంపిక
పెదకూరపాడు: పెదకూరపాడు అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఏకుల ప్రసాదరావు ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు’కు ఎంపికై నట్లు సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య గురువారం తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రసాదరావు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు. ఈ నెల 13వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావును పలువురు ఉపాధ్యాయులు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు అభినందించారు.