
పూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్లటౌన్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన జ్యోతిరావుపూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత చీలురోడ్డు సెంటర్‌లోని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే వివక్ష, అంటరానితనంపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. విజయవాడ నుంచి గూడూరు వరకు రూ.రెండు వేల కోట్లతో నాలుగో వరుస రైల్వేలైన్, రేపల్లె–తెనాలి మధ్య రెండో రైల్వే లైన్ మంజూరు అయ్యిందన్నారు. గుంటూరు నుంచి నిజాంపట్నం వరకు రూ.1200 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే మంజూరైందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి రూ.97.52 కోట్లు నిధులు వచ్చాయన్నారు. రూ.29 కోట్లతో బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి, బీసీ నాయకులు శంకరరావు, జయప్రకాష్ నారాయణ, వీరరాఘవయ్య, జి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
బాపట్ల ఎంపీ
తెన్నేటి కృష్ణప్రసాద్