
వక్ఫ్ సవరణపై భగ్గుమన్న ముస్లింలు
బాపట్లటౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అంజుమన్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం జానీ తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం బాపట్ల అంజుమన్ ఏ ఇస్లామియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ముస్లిం సోదరులు నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఫ్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. నినాదాలతో బాపట్ల హోరెత్తింది. ముస్లిం సోదరులుకు సంఘీభావంగా బాపట్లలోని వివిధ రాజకీయపార్టీల నాయకులు, లౌకికవాదులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. తొలుత పాత బస్టాండ్ వద్ద గల అంజుమన్ ఇస్లామియా మసీదు నుండి బయలుదేరిన ర్యాలీ చీలు రోడ్డు, పాత బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం కార్యాలయానికి చేరుకుంది. అంబేడ్కర్ సర్కిల్‌లో ముస్లిం సోదరులు మానవహారంగా ఏర్పడ్డారు. అబ్దుల్ రహీం జానీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ముస్లింల హక్కులను కాలరాసేందుకు అనేక నల్ల చట్టాలు చేస్తుందన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ముస్లింలపై కక్ష కట్టి నిరంకుశ పాలన కొనసాగిస్తుందన్నారు. అంజుమన్ కమిటీ కార్యదర్శి అబ్దుల్ కరీం మాట్లాడుతూ వక్ఫ్ అంటే ముస్లిం సోదరులు తమకు ఉన్న సంపదలో అల్లా పేరిట దానం చేసే ఆస్తి అన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ముస్లిం సోదరులకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డులో అన్యమతస్తులను భాగస్వామ్యాన్ని కల్పించడం సమంజసం కాదన్నారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలు, క్రైస్తవుల హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దురాగతాలపై సమిష్టిగా పోరాడి వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. సమాజ్‌వాద్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి గొర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఖాలీలుల్లా ఖాన్, జబీబుల్లా, సీపీఎం పట్టణ నాయకుడు కే శరత్, సీపీఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారావు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు చల్లా రామయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ పాల్గొన్నారు.
బాపట్లలో భారీ నిరసన ర్యాలీ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ముస్లిం సోదరులు అంబేడ్కర్ సెంటర్‌లో మానవహారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

వక్ఫ్ సవరణపై భగ్గుమన్న ముస్లింలు