భద్రాద్రి: ఏదైనా మంచి విషయం సత్ఫలితాలు ఇవ్వడంలో విఫలమైతే బూడిదలో పోసిన పన్నీరు అనే సామెతను ఉపయోగిస్తాం. కానీ అలాంటి బూడిద నుంచి సైతం కాసులు దండుకునే విద్య తెలిసిన వాళ్లు జిల్లాలో ఉన్నారు. వాళ్ల జాడ తెలియాలంటే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు వెళ్లాల్సిందే..
భారీగా బూడిద..
దేశమంతటా థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే టీఎస్ జెన్‌కో మాత్రం నడుస్తున్న ట్రెండ్‌కు విరుద్ధంగా పాత కాలం నాటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ టెక్నాలజీ వాడటం వెనుక కారణాలు ఏమైనా.. దీంతో ప్లాంట్ నుంచి బూడిద అధికంగా విడుదలవుతోంది.
ఇలా వచ్చిన బూడిదకు నీటిని కలిపి కొంత భాగం యాష్ పాండ్‌కు తరలిస్తే మరికొంత బూడిదను సిమెంట్, ఇతర పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. నిత్యం టన్నుల కొద్దీ వెలువడుతున్న బూడిదను వదిలించుకోవడం బీటీపీఎస్‌కు అనివార్యం. అయితే ఉచితంగా బూడిదను పరిశ్రమలకు ఇవ్వకుండా నామమాత్రపు ధరకే థర్మల్ పవర్ ప్లాంట్‌లు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది.
లారీకి రూ.400 అదనం..
ఎలాంటి లెక్కాపత్రం లేకుండా యాష్ కోసం వచ్చిన లారీల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. బూడిద కొనుగోలుకు సంబంఽధించిన రసీదు ఇవ్వడం, లోడ్ చేసిన బూడిదకు తగ్గ వే బిల్లులు ఇవ్వడం వంటి పనుల్లో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 200 వసూలు చేస్తున్నారు.
ఆ తర్వాత వే బిల్లులు జారీ చేసే దగ్గర రూ.100, ప్లాంటు గేటు దగ్గర ఇన్, ఔట్‌లకు కలిపి రూ.100 వంతున లారీల దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాంట్ నుంచి నిత్యం 100కు పైగా లారీల్లో యాష్ బయటకు వెళ్తుంది. అంటే ఒక్కో లారీ నుంచి రూ.400 చొప్పున రోజుకు రూ. 40,000 ఎలాంటి లెక్కా పత్రం లేకుండా జేబులో వేసుకుంటున్నారు.
ఇలా నెలకు రూ.12 లక్షల వరకు యాష్ నుంచే కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ దందా నిత్యం జరుగుతున్నా అధికారులెవరూ ఇదేంటని ప్రశ్నించరు. అధికారుల అండదండలను ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. టన్ను బూడిద ధర రూ.109 ఉండగా వీళ్లు రూ.150 వరకు కూడా అమ్ముతున్నారు.
ఇదేం దోపిడీ..?
గతంలో పాల్వంచలోని కేటీసీఎస్ కేంద్రంగా బూడిద దందాలో ఖజానా నింపుకున్న కాంట్రాక్టర్లలో కొందరు ఇప్పుడు బీటీపీఎస్‌పై కన్నేశారు. బీటీపీఎస్‌లో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్లాంట్ ప్రతిష్టకు మచ్చ కలుగుతోంది. దశాబ్దాల తరబడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో సైతం లేని అవినీతి ఇటీవలే ప్రారంభమైన ప్లాంట్‌లో ఉండడం ఏంటని పారిశ్రామిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంత అవినీతి జరుగుతున్నా ఇక్కడి అధికారులు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూడిద దందాపై వివరణ కోరేందుకు బీటీపీఎస్ డీఈకి ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
చెప్పిందే ధర..
బీటీపీఎస్ ఆరంభంలో టన్ను బూడిద రూ.69 చొప్పున సిమెంట్, ఇటుక పరిశ్రమలకు అమ్మేవారు. ఇటీవల ఈ ధరను రూ.109కి పెంచారు. ప్రత్యేకమైన కంటైనర్లు కలిగిన లారీల్లో బూడిదను తరలిస్తారు. సగటున ఈ ట్యాంకర్ల కెపాసిటీ 25 టన్నుల వరకు ఉంటుంది. అంటే ఒక్కో యాష్ కంటైనర్ లారీలో బూడిదను నింపుకునేందుకు రూ.2,725 నామమాత్రపు ఫీజు చెల్లిస్తే 25 టన్నుల బూడిద తీసుకెళ్లొచ్చు.
అయితే సిమెంట్ కంపెనీలు లేదా లారీ కంటైనర్ల ఓనర్లు బూడిద కోసం ప్లాంట్‌కు చెల్లిస్తున్న ధర పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అంతకంటే వాళ్లకు ప్రధానమైనది లోడింగ్, అన్ లోడింగ్. ఈ పనిలో ఆలస్యం జరిగితే విలువైన సమయం వృథా అవుతుంది. కంటైనర్లకు వచ్చే కిరాయి, డ్రైవర్ ఖర్చులు, క్లీనర్ బేటాలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని బూడిద అమ్మకాల్లో కొత్త దందాకు తెరలేపారు.
Comments
Please login to add a commentAdd a comment