నేటి నుంచి వాగ్గేయకారోత్సవాలు
● ఐదు రోజులపాటు అలరించనున్న కళాకారులు ● భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు ముస్తాబు
భద్రాచలం: ప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీ సీతారామ చంద్రస్వామివారి అపరభక్తుడు, భద్రాచలం దేవస్థానం నిర్మాణ కర్త భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబైంది. రామదాసు జయంతి సందర్భంగా ఏటా శ్రీ నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్టు, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సంగీత కళాకారులు, వాయిద్య కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటారు. ఈ ఏడాది 392వ జయంతి సందర్భంగా శనివారం నుంచి 5వ తేదీ వరకు జరిగే వేడుకలకు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం వేదిక కానుంది. భక్త రామదాసు కీర్తనలతో పాటు సంగీత కార్యక్రమాలతో భద్రగిరి స్వరరాగ ఝరిలో ఓలలాడనుంది. శనివారం ఉదయం 9 గంటలకు నగర సంకీర్తన, రామదాసు విగ్రహానికి అభిషేకంతో వాగ్గేయకారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం చిత్రకూట మండపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద రామదాసు నవరత్న కీర్తనల గోష్టిగానం, అనంతరం సంగీత కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
స్వర్ణకవచధారణలో దర్శనమిచ్చిన రామయ్య
దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment