మళ్లీ టీఎన్‌టీయూసీదే గెలుపు
ఐటీసీలో 60 ఓట్ల మెజారిటీతో విజయం
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్‌పీడీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మళ్లీ టీఎన్‌టీయూసీనే విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఎన్‌టీయూసీ రెండోసారి కూడా విజయ ఢంకా మోగించింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 1253 ఓట్లకు గాను 1252 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాత్రి 7.30 గంటలకు ఎన్నికల ఫలితాలను కార్మికశాఖ అధికారులు వెల్లడించారు. టీఎన్‌టీయూసీ 480 ఓట్లు సాధించి 60 ఓట్ల మెజారిటీతో గెలిచింది. హోరాహోరీగా తలపడిన ఐఎన్‌టీయూసీ 420 ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. బీఆర్‌టీయూ 310 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. బీఎంఎస్ 21 ఓట్లు, టీఈయూ 18 ఓట్లు పొందాయి. మూడు ఓట్లు చెల్లలేదు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఆర్‌టీయూలు రెండు నెలలుగా ప్రచారం హోరెత్తించాయి. అన్ని ట్రేడ్ యూనియన్లు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశాయి.
డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు
పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో పలు వురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఎన్నికల బందోబస్తు నిర్వహించారు. కార్మికశాఖ అధికారులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించారు. విజయం సాధించిన టీఎన్‌టీయూసీ మిత్రపక్షాలు శుక్రవారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. రంగులు చల్లుకుని టపాసులు కాలుస్తూ విజయోత్సవాన్ని జరుపుకున్నాయి. టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్‌ను పలువురు నాయకులు, కార్మికులు అభినందనలతో ముంచెత్తారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, రత్నాకర్, గల్లా నాగభూషయ్య, గాదె రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment