అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు స్థానిక నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో శుక్రవారం మట్టి(సాయిల్) పరీక్షలు చేశారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మండల పరిధిలోని గుమ్మడవల్లి వద్ద ఉన్న పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ తిరిగి నిర్మించేందుకు నీటిపారుదల శాఖ రూ.90 కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్ల నిధులను కేటాయించారు. ప్రాజెక్టు రీడిజైన్ ప్రకారంలో ఇప్పుడు ఉన్న మూడు గేట్లతోపాటు అదనంగా మరో ఐదు గేట్లతో నిర్మించేలా ప్రతిపాదించారు. దీంతో అదనపు గేట్ల నిర్మాణానికి ఆనకట్ట వద్ద అనువుగా ఉందా.? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు చేపట్టారు. యంత్రాల సాయంతో భూగర్భంలో నుంచి మట్టి బయటకు తీస్తున్నారు. ఇలా సేకరించిన మట్టి హైదరాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి పంపిస్తామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ప్రకారం ముందుకెళ్తామని స్థానిక నీటి పారుదల శాఖ ఏఈఈ శ్రీనివాస్ తెలిపారు.