
పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి
● అడవుల సంరక్షణ అందరి బాధ్యత ● డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
చండ్రుగొండ / అన్నపురెడ్డిపల్లి : అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి కిష్టాగౌడ్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లోని ప్లాంటేషన్‌లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. కొత్తగా పోడుపేరుతో అడవులను ధ్వంసం చేసినా, అక్రమించుకున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు, తుపాకులు, విద్యుత్ వైర్లు అమర్చి వన్యప్రాణులను వేటాడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సహకరించే వారిపై కూడా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు, రేంజర్ ఎల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.