
మక్కలు కొనేదెప్పుడో..?
● మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ● మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తున్న వ్యాపారులు ● ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు
ఇల్లెందురూరల్: జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చింది. యాభై శాతానికి పైగా నూర్పిడి కూడా పూర్తి కావడంతో మక్కలను కల్లాల్లో ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తామని ఇటీవల మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆశించిన దిగుబడి రాకున్నా కనీసం మద్దతు ధరైనా దక్కుతుందని భావించారు. ప్రకటన వెలువడి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవడం, మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
11 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు
జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 11 చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇల్లెందు, చల్లసముద్రం, కొమరారం, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, మర్కోడు, శెట్టుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటతోపాటు దిగుబడిని బట్టి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
16,938 ఎకరాల్లో సాగు
జిల్లాలో ప్రస్తుత యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16,938 ఎకరాలుగా నమోదైంది. అనధికారికంగా (పట్టాదారు పాస్‌పుస్తకాలు లేని భూములు) మరో పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఇందులో అత్యధిక విస్తీర్ణం ఇల్లెందు ఏజెన్సీలోనే సాగవుతోంది. సాధారణంగా వానాకాలం కంటే యాసంగిలోనే మొక్కజొన్న దిగుబడి అధికంగా ఉంటుంది. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈసారి మొక్కజొన్న దిగుబడి తగ్గింది. ఎకరానికి 30 క్వింటాళ్లు దాటడం లేదు. ఈ చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు..
ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2,225 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వాతావరణంలో మార్పులు, తరచూ వర్ష సూచనలతో ఆందోళనకు గురై వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే అదునుగా వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని, క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి చెల్లించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏటా మక్కల కొనుగోళ్ల సమయంలో ఎర్రజెండా పార్టీలు రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి మద్దతు ధరను నిర్ణయించే సంప్రదాయం ఇల్లెందు ఏజెన్సీలో ఉంటుంది. ఈసారి కూడా సమావేశం నిర్వహిస్తామని పది రోజుల క్రితం ప్రకటించినా.. ఆ తర్వాత మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది.
తక్కువకే విక్రయిస్తున్నాం
మొక్కజొన్న కంకులను నూర్పిడి చేసి పక్షం రోజులైంది. వాతావరణంలో మార్పులు, వర్ష సూచనతో ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటా రూ.2,050కి విక్రయించాను. క్వింటాకు రూ.200 నష్టపోయాను. – మంచె శ్రీను,
రైతు, కొమరారం, ఇల్లెందు మండలం
కేంద్రాలు ప్రారంభించాలి
ఏటా మొక్కజొన్న కొనుగోళ్లు యాభైశాతం పూర్తయిన తరువాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తోంది. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ఇప్పటికే అత్యధిక మంది రైతులు నూర్పిడి పూర్తి చేసి పంట విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్క్‌ఫెడ్ తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – అజ్మీర సీతారాం,
రైతు, బోయితండా, ఇల్లెందు మండలం

మక్కలు కొనేదెప్పుడో..?