
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సుజాతనగర్: కుమారుడిని తీసుకొని రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి మృతి చెందగా ఆరేళ్ల కుమారుడికి గాయాలైన ఘటన సుజాతనగర్ సెంటర్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుంచి ఎనిమిదేళ్ల కిందట వలస వచ్చిన పొడియం దినేశ్ (39) ములకలపల్లి మండలం ధర్మన్ననగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఆయన సుజాతనగర్ మండలంలోని రాఘవపురంలో తన సోదరుడు గంగయ్య వద్ద ఉన్న కుమారుడు భీమాను తీసుకుని సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న భద్రాచలం డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేశ్ మృతి చెందగా, భీమాకు గాయాలయ్యాయి. కాగా, ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ కోటగిరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమాదేవి తెలిపారు.
దిక్కు లేని స్థితిలో కుటుంబం
రోడ్డు ప్రమాదంలో దినేశ్ చనిపోగా, గాయపడిన ఆయన కుమారుడు భీమాను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ఆయనను ఆరా తీస్తే వివరాలు చెప్పలేకపోగా, తండ్రి మృతి చెందాడనే బాధలో తన గాయాలను మర్చిపోయి చికిత్సకు సహకరించలేదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, దినేశ్ చనిపోయిన విషయం తెలిసిన ఆయన భార్య లక్ష్మి, మిగతా పిల్లలతో ఆస్పత్రికి చేరుకుని భీమాను పట్టుకుని రోదించడం కలిచివేసింది. అయితే, వలస వచ్చిన కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆయన భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు.
ఆయన కుమారుడికి గాయాలు