
మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● మణుగూరులో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం
బూర్గంపాడు/అశ్వాపురం/మణుగూరుటౌన్/ కరకగూడెం/పినపాక: మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పినపాక నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మణుగూరు మండలం కూనవరంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే విద్య ప్రాముఖ్యతను చాటారని పేర్కొన్నారు. మణుగూరు డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.4.33 కోట్లతో నిర్మించనున్న 30 అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రామానుజవరం–గొల్ల కొత్తూరు పీతురు వాగుపై రూ.1.90 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు, పగిడేరు–రామానుజవరం మార్గంలో పగిడేరు వాగుపై రూ.1.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరు స్టేజీ నుంచి గ్రామానికి రూ.63 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, జగ్గారంలో జగ్గారం నుంచి కుర్సంవారిగూడెం వరకు రూ.1.92 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. జగ్గారంలో అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ పూజలు చేశారు. బూర్గంపాడు– సోంపల్లి గ్రామాల మధ్య రూ.90 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక మండలంలో సుమారు రూ. 4 కోట్లతో నిర్మించునున్న బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. మల్లారం గ్రామంలో చిలకమ్మ దేవాలయ అభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు రామనాథానికి ఆర్థికసాయం చేశారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామ బొడ్రాయి వద్ద నుంచి సమీపంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.
స్వార్థ రాజకీయాలకు చిరునామా బీజేపీ
బీజేపీ స్వార్థ రాజకీయాలకు చిరునామా అని, రాజ్యాంగ వ్యవస్థలను తన స్వార్థానికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని, ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం ఏడాదిపాటు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలోనే నూతన అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందిస్తామని అన్నారు. కాగా గోదావరి వరద ముంపు నుంచి బూర్గంపాడు మండలాన్ని కాపాడాలని, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, బేతం రామకృష్ణ, కమటం నరేష్, ఓరుగంటి భిక్షమయ్య, పోలేబోయిన శ్రీవాణి, చందా సంతోష్, బట్టా విజయ్‌గాంధీ, పీరినాకి నవీన్, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పోలెబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, కాటబోయిన నాగేశ్వరరావు, శివ, సామా శ్రీనివాసరెడ్డి, రవి, అబ్దుల్లా, సర్వేశ్వరరావు సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య తదితరులు పాల్గొన్నారు.
14 నుంచి భూ భారతి చట్టం అమలు
భూ సమస్యల పరిష్కారానికి ఈనెల 14 నుంచి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెస్త్నుట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ, ఇప్పుడూ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే గిరిజన ప్రాంతానికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చే జూన్ 2 నుంచి నియోజకవర్గానికి 4, 5 వేల మంది లబ్ధిదారులకు చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 14 నెలల్లోనే పినపాక నియోజకవర్గంలో రూ.30కోట్ల మేర రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నేతృత్వంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు విజయవంతం చేశారని, శభాష్ రాహుల్ అంటూ అశ్వాపురం మండలం బీజీకొత్తూరు వద్ద ఐటీడీఏ పీఓను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.