
పాత ఇనుప దుకాణంలో అగ్నిప్రమాదం
పాల్వంచ: పాత ఇనుమ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని తెలంగాణనగర్ వద్ద గల బీఎల్ నాయుడుకు చెందిన పాత ఇనుప దుకాణం యార్ద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సిగరేట్ తాగి పడేయడంతో చెత్తకు అంటుకుని మంటలు చెలరేగాయి. స్క్రాప్‌నకు వచ్చిన సుమారు పది కార్లకు నిప్పంటుకుని భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ ఆఫీసర్ పుల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఆయూబ్, ఉదయ్, ప్రతాప్, వెంకటేశ్వర్లు మంటలను ఆర్పివేశారు.
కారు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
పాల్వంచరూరల్: ద్విచక్రవాహనంపై రిటైర్డ్ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన, భద్రాచలం ఐటీడీఏ ఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన కటుకూరి నాగభూషణం (63) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎదురుగా భద్రాచలంవైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగభూషణాన్ని ఖమ్మం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కోయిల విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు. మృతుడికి భార్య పవిత్ర, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణ (40) మృతిచెందాడు. ఎల్లాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరైన కృష్ణ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కొమరారం పోలీసులు కృష్ణను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే కృష్ణ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్‌ఐ సోమేశ్వర్ తెలిపారు.
సివిల్ లైన్‌లో చోరీ..
ఇల్లెందు: పట్టణంలోని సివిల్‌లైన్‌లో పెద్దపల్లి కుమారస్వామికి చెందిన ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు కుమారస్వామి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పరిశీలించారు. 18 తులాల బంగారం, రెండు జతల వెండి పట్టీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.