న్యూఢిల్లీ: 5జీ నెట్‌వర్క్ లాంచ్ దశలో మొబైల్ యూజర్లు సెకనుకు 600 మెగాబిట్ వరకూ స్పీడ్‌తో సర్వీసులు అందుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డేటా ప్రాసెసింగ్, యాప్‌ల యాక్సెస్ చేయడం మొదలైన అంశాల్లో ప్రొఫెషనల్ కంప్యూటర్లకు సరిసమాన స్థాయిలో హ్యాండ్‌సెట్లు పనిచేస్తాయని పేర్కొన్నాయి.
రిలయన్స్ జియో నాలుగు నగరాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి), భారతి ఎయిర్‌టెల్ హైదరాబాద్ సహా 8 నగరాల్లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సిమ్ మార్చుకోకుండానే 5జీ సేవలను పొందవచ్చని రెండు సంస్థలు వెల్లడించాయి. ’బీటా ట్రయల్’ నిర్వహిస్తున్న జియో సంస్థ సెకనుకు 1 గిగాబిట్ (జీబీపీఎస్) స్పీడుతో అపరిమితమైన 5జీ డేటా అందిస్తామని చెబుతోంది. మొబైల్ స్టేషన్లకు సమీపంలో ఉన్న వారికి ఈ స్థాయి స్పీడ్ లభించవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
‘నెట్‌వర్క్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంచ్ దశలో 600 ఎంబీపీఎస్ వరకూ స్పీడ్‌తో 5జీ సేవలు లభించవచ్చు. అయితే, పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చాక ఇది 200–300 ఎంబీపీఎస్ శ్రేణిలో ఉండవచ్చు‘ అని ఎరిక్సన్ సంస్థ నెట్‌వర్క్ సొల్యూషన్స్ హెడ్ థియాసెంగ్ నిగ్ తెలిపారు. గరిష్టంగా 600 ఎంబీపీఎస్ స్పీడుతో 4కే రిజల్యూషన్ గల సినిమాను 3 నిమిషాల్లో, రెండు గంటల నిడివితో 6జీబీ సైజు గల హై డెఫినిషన్ సినిమాను 1 నిమిషం 25 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అప్పటివరకూ ఉచితంగానే ..
కొత్త సర్వీసుల రుచి తెలిసేంత వరకూ, కొన్ని సర్కిల్స్‌లోనైనా పూర్తి స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించే దాకా 5జీ సేవలను టెల్కోలు ఉచితంగానే ఆఫర్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఒక సర్కిల్‌లో సర్వీసులను పూర్తిగా విస్తరించిన తర్వాత టెల్కోలు టారిఫ్‌లను ప్రకటించవచ్చని, రేట్లు 4జీతో పోలిస్తే కొంత అధికంగానే ఉండవచ్చని ఆయన చెప్పారు. మరోవైపు, 5జీలో హై స్పీడ్ కారణంగా దేశీయంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో ప్రతి యూజరు డేటా వినియోగం సగటున రెట్టింపు కాగలదని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ మాలిక్ తెలిపారు. 5జీ సర్వీసుల టారిఫ్‌లు దేశాన్ని బట్టి మారుతుంటాయని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో 5జీకి ప్రత్యేకంగా చార్జి చేయడం లేదని కొన్ని దేశాల్లో మాత్రం ప్రీమియం వసూలు చేస్తున్నారని చెప్పారు. భారత్‌లో పాటించే విధానమనేది వ్యాపార పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 2024 మార్చి నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులో తేవాలని టెల్కోలు భావిస్తున్నాయి.
డిజిటల్ సాధికారత..
దేశీయంగా డిజిటల్ సాధికారతను వేగవంతం చేసేందుకు 5జీ ఉపయోగపడగలదని హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సునీల్ రైనా తెలిపారు. అందుబాటు ధరల్లో పరికరాల లభ్యత దీనికి కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 5జీ విస్తరించే కొద్దీ దేశీయంగా స్మార్ట్‌ఫోన్లు, ఇతర పరికరాల ధరలూ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. లావా ప్రస్తుతం అత్యంత చౌకగా రూ. 10,000కే లావాబ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇక 5జీకి సంబంధించి హ్యాండ్‌సెట్స్ తదితర పరికరాల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. హై–స్పీడ్ డేటా వినియోగం వల్ల బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉన్నందున చాలా మటుకు ఫోన్ కంపెనీలు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో పాటు 5,000 పైగా ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీలతో మొబైల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2027 నాటికి దేశీయంగా మొత్తం సబ్‌స్క్రిప్షన్స్‌లో 5జీ వాటా దాదాపు 40 శాతం వరకూ ఉంటుందని అంచనా.
చదవండి👉 ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదంట!
Comments
Please login to add a commentAdd a comment