న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితుల కోణంలో చూస్తే అదానీ గ్రూప్ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లో నెలకొన్న అల్లకల్లోలం అంతా ’టీ కప్పులో తుఫాను’లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోను కావడం సర్వసాధారణమేనని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు చర్యలు తీసుకునేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులు, బీమా సంస్థలపై ప్రభావాల గురించి స్పందిస్తూ .. దేశీ ఆర్థిక సంస్థలు పటిష్టంగానే ఉన్నాయని సోమనాథన్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు తగిన పరిస్థితులు కల్పించడం, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ పటిష్టంగా .. పారదర్శకంగా ఉండేలా చూడటం వంటి అంశాల గురించే ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
బ్యాంకింగ్ రంగం పటిష్టం: ఆర్‌బీఐ
అదానీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ గ్రూప్ పేరును ప్రస్తావించకుండా .. దేశీ బ్యాంకింగ్ రంగం పటిష్టంగా, స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరత్వాన్ని పాటించే క్రమం ్డలో .. ఒక నియంత్రణ సంస్థగా బ్యాంకుల పరిస్థితిని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. భారీ రుణాల విషయంలో బ్యాంకులు కూడా నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది.
డో జోన్స్ సూచీల నుంచి ఏఈఎల్ తొలగింపు..
అకౌంటింగ్ మోసాల ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమ సస్టెయినబిలిటీ సూచీల నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించనున్నట్లు ఎస్‌అండ్‌పీ డోజోన్స్ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలడం, రూ. 20,000 కోట్ల భారీ ఎఫ్‌పీవోను అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉపసంహరించడం తెలిసిందే.
నిధుల సమీకరణ కష్టతరం..
గ్రూప్ కంపెనీల షేర్ల భారీ పతనం కారణంగా అదానీ గ్రూప్ తదుపరి నిధుల సమీకరణపై ప్రతికూల ప్రభావం పడొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఇటీవలి పరిణామాలతో తాము రేటింగ్ ఇచ్చే గ్రూప్ సంస్థల ఆర్థిక పరిస్థితులను సమీక్షించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక కాంట్రాక్టులు, మార్కెట్లో ఆధిపత్యం తదితర అంశాలపరంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లకు తాము రేటింగ్ ఇచ్చినట్లు వివరించింది. మరోవైపు, అదానీ సంస్థల రుణ పరపతిపై తాజా అంశాల తక్షణ ప్రభావమేమీ ఉండబోదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అటు, అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థల రేటింగ్స్‌ను స్థిర స్థాయి నుంచి నెగటివ్ స్థాయికి ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ కుదించింది. రేటింగ్స్ ఇచ్చేటప్పుడు తాము పరిగణనలోకి తీసుకున్న రిస్కులపై ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువ ఆందోళన ఉండవచ్చని లేదా ప్రతికూల సెంటిమెంటు కారణంగా గ్రూప్ నిధుల సమీకరణ వ్యయాలు మరింతగా పెరగవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదు: ఎస్‌బీఐ
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు. రుణాలతో పాటు లెటర్స్ ఆఫ్ క్రెడిట్, పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల రూపంలో ఎస్‌బీఐ ఇచ్చినది సుమారు రూ. 27,000 కోట్ల ఉంటుందని, ఇది తమ మొత్తం పద్దుల్లో 0.88 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు. రీపేమెంటులో అదానీ గ్రూప్‌నకు మంచి రికార్డే ఉందని, వడ్డీల చెల్లింపులో సమస్యలెదుర్కొనే పరిస్థితి ఉంటుందని భావించడం ఆయన చెప్పారు. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలను గత రెండేళ్లలో క్రమంగా తగ్గించుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ సంజీవ్ చడ్ఢా చెప్పారు. ప్రస్తుతమున్న వాటికి సంబంధించి కూడా అసెట్ క్వాలిటీపరంగా ఆందోళనేమీ లేదని వివరించారు. మరోవైపు, భారతీయ చట్టాలకు అనుగుణంగానే అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్ ఎస్‌ఈ తెలిపింది. ఇటీవలి పరిణామాల కారణంగా వీటినేమీ పునఃసమీక్షించలేదని పేర్కొంది. టోటల్‌ఎనర్జీస్‌కు అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.75 శాతం వాటాలు ఉన్నాయి.
అదానీ గ్రూప్ షేర్ల పతనం.. ఇదంతా జస్ట్ టీ కప్పులో తుఫాను..
Published Sat, Feb 4 2023 3:54 AM | Last Updated on Sat, Feb 4 2023 9:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment