సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇటీవల చేసిన ఆరోపణలు ప్రభావం సంస్థను భారీగానే ప్రభావితం చేస్తోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చి 12 రోజుల తరువాత కూడా ఆ సెగలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన అన్ని షేర్లు భారీగా కుప్పకూలగా, అదానీ చైర్మన్ గౌతం అదానీ నికర సంపద దారుణంగా పడిపోయింది. చివరికి అదానీగ్రూప్‌నకు కీలకమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోను కూడా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి తాజాగా అదానీకి మరో షాక్ తగలనుందనే ఊహాగానాలు మార్కెట్‌లో ఉన్నాయి. రూ. 11,574 కోట్ల రుణాన్ని రీకాల్ చేసే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, దాని అనుబంధ కంపెనీలు తీసుకున్న మొత్తం రూ. 11,574 కోట్ల అన్‌సెక్యూర్డ్ లోన్స్ రుణాలను ఇపుడు బ్యాంకులు ,ఆర్థిక సంస్థలు రీకాల్ చేసే అవకాశం ఉందని అంచనా. రూ.20 వేల కోట్ల ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ను ఆకస్మికంగా ఉపసంహరించుకోవాలని గ్రూప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం, ప్రత్యేకించి అదనపు వనరులను సమీకరించడంలో కొత్త సవాళ్లను సృష్టించింది. ముఖ్యంగా కంపెనీ పెట్టుబడి దారులకు వెల్లడించిన వివరాల ప్రకారం, "ఈ రుణాలు ఏదైనా అంగీకరించిన రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం తిరిగి చెల్లించలేకపోవచ్చు, రుణదాత ఎప్పుడైనా రీకాల్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే జరిగితే తమ అనుబంధ సంస్థలు ఫైనాన్సింగ్ కోసం ప్రత్యామ్నాయ వనరులను కనుగొనవలసి ఉంటుందని, అయితే బలమైన నగదు ప్రవాహం, సురక్షితమైన ఆస్తులతో గ్రూప్ బ్యాలెన్స్ షీట్ చాలా ఆరోగ్యంగా ఉందని గౌతం అదానీ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి తాజా అంచనాలపై అదానీ మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
అట్టుడుకిన పార్లమెంట్
మరోవైపు అదానీపై అవినీతి ఆరోపణలతో హిండెన్‌బర్గ్ నివేదికసౌ విపక్షాలు సోమవారం పార్లమెంటులో లేవనెత్తాయి, చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాగా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత అంబుజా, ఏసీసీ సిమెంట్‌తో సహా తొమ్మిది అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడు ట్రేడింగ్ రోజుల వ్యవధిలో దాదాపు సగం (100 బిలియన్ డాలర్ల వరకు) క్షీణించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక్కటే భారీ మార్కెట్ క్యాప్ విలువను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment