న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్ల ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ (ఎన్‌ఎస్‌డీఎల్) స్తంభింపచేసిందన్న వార్తలను పారిశ్రామిక దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని పేర్కొంది. సదరు ఫండ్స్ ఖాతాలు యాక్టివ్‌గానే ఉన్నాయని స్పష్టం చేసింది. ‘ఇన్వెస్టర్లను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేందుకే ఇది చేశారు. దీనివల్ల ఇన్వెస్టర్లకు ఆర్థికపరమైన నష్టం జరగడంతో పాటు గ్రూప్ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతోంది‘ అని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇది మైనారిటీ ఇన్వెస్టర్లపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సదరు ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలపై స్పష్టతనివ్వాలని రిజి్రస్టార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌ని కోరాము. వాటిని స్తంభింపచేయలేదని స్పష్టం చేస్తూ వారు జూన్ 14న ఈ–మెయిల్ పంపారు‘ అని అదానీ గ్రూప్ పేర్కొంది. ఇవే అంశాలను అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ సంస్థలు.. స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేశాయి. మరోవైపు, అదానీ గ్రూప్ ప్రస్తావించిన డీమ్యాట్ ఖాతాలు యాక్టివ్‌గానే ఉన్నాయని కంపెనీకి పంపిన ఈమెయిల్‌లో ఎన్‌ఎస్‌డీఎల్ స్పష్టం చేసింది. అయితే, ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో ఆయా ఖాతాలను స్తంభింపచేసినట్లుగానే చూపుతుండటం గమనార్హం. అకౌంట్ స్థాయిలో వీటిని ఫ్రీజ్ చేసినట్లు పోర్టల్‌లో ఉంది. అయితే అదానీ గ్రూప్ స్టాక్‌లలో పెట్టుబడులకు సంబంధించి ఆయా ఫండ్స్ ఖాతాలు యాక్టివ్‌గానే ఉన్నాయని రిజిస్ట్రార్ కూడా స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో స్తంభింపచేసినట్లుగా చూపుతున్న ఖాతాలు వేరే సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించినవని పేర్కొన్నాయి. ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఆయా ఫండ్స్ దశాబ్దంపైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నాయని అదానీ వివరించింది.
వివాదమిదీ..
అల్‌బ్యూలా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లకు..అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. వీటి ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్ స్తంభింపచేసిందనే వార్తలే గందరగోళానికి కారణమయ్యాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో ఈ ఫండ్స్‌కి 2.1 శాతం నుంచి 8.91 శాతం దాకా వాటాలు ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన టాప్ 12 ఇన్వెస్టర్ల జాబితాలో ఇవి కూడా ఉంటాయి. సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు ముందు.. ఈ పెట్టుబడుల విలువ సుమారు 7.78 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ ఉన్నాయి. క్రెస్టా ఫండ్ డీమ్యాట్ ఖాతాలో అదానీ గ్రూప్‌లోని ఆరు లిస్టెడ్ సంస్థలకు సంబంధించి 10.76 కోట్ల షేర్లు ఉన్నాయి. అల్బులా ఇన్‌వెస్ట్‌మెంట్ ఖాతాలో 8.59 కోట్లు, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఖాతాలో అయిదు సంస్థలకు సంబంధించి 15.52 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ ఖాతాలన్నీ యాక్టివ్‌గానే ఉన్నట్లు ఎన్‌ఎస్‌డీఎల్ వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
చదవండి : అదానీ షాక్! ట్విటర్‌లో ప్రముఖ జర్నలిస్ట్ పేరు ట్రెండింగ్..!
Comments
Please login to add a commentAdd a comment