అసాధారణమైన కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం ప్రపంచాన్ని ఒక్కసారిగా చుట్టేసింది. దీనితో వ్యాపారాలు కుదేలై, ఉద్యోగాలు కోల్పో యి, ఆదాయాలు పడిపోయి, ఖర్చులు పెరిగిపోయి ఎందరో సతమతమవుతున్నారు. ఇళ్లు గడవడం కోసం చాలా మంది రిస్కు చేసి మరీ పనిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కష్టకాలమే అయినప్పటికీ భద్రమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని గురించిన అనేక పాఠాలు చెబుతోంది. కష్టసమయంలో మీ ఆర్థిక పరిస్థితులను నియంత్రణలో ఉంచుకోవడానికి తోడ్పడే అంశాలు కొన్ని ఉన్నాయి.
* ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మదింపు చేసుకోవాలి: మీకు ఆదాయం వచ్చే అన్ని వనరులను (జీతభత్యాలు, పెట్టుబడులు–పొదుపు మొత్తాలపై రాబడులు మొదలైనవి) పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆస్తులు, పెట్టుబడుల జాబితా తయారు చేసుకోవాలి. అవసరమైతే అప్పటికప్పుడు లిక్విడేట్ (వెంటనే విక్రయించి నగదు పొందగలిగేవి) చేయగలిగేవి, 1–3 నెలల వ్యవధిలో విక్రయించగలిగేవి, అమ్మడానికి సమయం పట్టేసేవి (స్థిరాస్తులు, లాకిన్ పరిమితులు ఉండే ఫండ్‌లు, బాండ్లు వంటివి) అన్నీ ఒక లిస్టు రూపొందించుకోవాలి. ఆ తర్వాత మీ బాకీలు, చెల్లించాల్సిన రుణాలు మొదలైనవి రాసుకోవాలి.
* ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి: పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదాయాలు, వ్యయాలు, పొదుపు, పెట్టుబడులు, రుణాలు మొదలైనవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన స్వల్పకాలిక .. దీర్ఘకాలిక అవసరాలు, ఆకాంక్షలు, జీవిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి. మారే అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా మధ్య, మధ్యలో ఆయా ప్రణాళికల్లో అవసరమైతే సవరణలు చేసుకుంటూ ఉండాలి. కొంత మొత్తాన్ని సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లలో ఇన్వెస్ట్ చేయడం పరిశీలించవచ్చు. ఇవి ఎక్కువ భారంగా ఉండవు. పన్నుపరంగానే కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు పెట్టుబడి వ్యయం కొంత తగ్గుతుంది.
జీవిత బీమా, ఆరోగ్య బీమా
జీవితం ఎంత అస్థిరమైనదన్నది కరోనా మహమ్మారి ప్రపంచానికి తెలియజెప్పింది. కాబట్టి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ ఇంటి పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినా కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా తగు స్థాయి కవరేజీతో జీవిత బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీనిచ్చే టర్మ్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభ పరిస్థితుల్లో గ్యారంటీగా రాబడులు ఇచ్చే పథకాల్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవలి కాలంలో జీవన శైలికి సంబంధించిన వ్యాధులు, చికిత్స వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలి. తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి.
అత్యవసర నిధి
ఆర్థిక సంక్షోభ సమయంలో అత్యవసర నిధే ఆదుకుంటుంది. దాదాపు 6–12 నెలల ఆదాయానికి సరిపడేంత స్థాయిలో ఇలాంటి ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేతిలో ఉండేలా చూసుకోవాలి. మరో విషయం, దీన్ని కేవలం ఎమర్జెన్సీలోనే ఉపయోగించాలన్న సూత్రాన్ని నిబద్ధతతో పాటించాలి.
రుణాల వలలో చిక్కుకోవద్దు
కొంగొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ గిమ్మిక్కులు, సులభంగా రుణాలు లభించే అవకాశాలు మొదలైన వాటి ఆకర్షణలో పడిపోతే రుణాల వలలో చిక్కుకునే ముప్పు ఉంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికకు ప్రతికూలమే కాకుండా, ఆర్థిక సంక్షోభ పరిస్థితి ఎదురైనప్పుడు గట్టి దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
వివిధ సాధనాల్లో పెట్టుబడులు
పెట్టుబడులన్నీ ఒకే సాధనంలో ఉంచకండి. షేర్లు, డెట్ (బాండ్లు మొదలైనవి), పసిడి, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో కొంత కొంతగా ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల రిస్కులు తగ్గించుకోవడంతో పాటు కొంత ఎక్కువ రాబడిని పొందగలిగే అవకా>శాలు ఉంటాయి. ఆర్థిక సాధనం ఎంచుకునేటప్పుడు ఎన్నాళ్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ అవసరానికి ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించగలవు. ఇవి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడం, చాలా రిస్కులతో ముడిపడి ఉన్నవి కావడం వల్ల స్వల్పకాలిక అవసరాల కోసం వీటిలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. స్థూలంగా చెప్పాలంటే, జీవితంలో ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, నిశ్చింతగా ముందుకెళ్లాలంటే ఆర్థిక క్రమశిక్షణ, వివేకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రస్తుత కరోనా మహమ్మారి కొన్నాళ్లకు వెళ్లిపోవచ్చు. కానీ ఈ సంక్షోభం నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాల సారాంశాన్ని గ్రహించి, ఇకపైనా అమలు చేయడం కొనసాగించగలిగితే.. భవిష్యత్తులో మరో సవాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనగలము.
- కార్తీక్ రామన్, సీఎంవో, ఏజీఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సురెన్స్
చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్‌ఆఫర్ ప్రకటించిన జెరోదా..!
Comments
Please login to add a commentAdd a comment