కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ | API Holdings, CMR Green Technologies, Wellness Forever Medicare get SEBI nod for IPO | Sakshi
Sakshi News home page

కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Published Tue, Feb 22 2022 5:47 AM | Last Updated on Tue, Feb 22 2022 5:47 AM

API Holdings, CMR Green Technologies, Wellness Forever Medicare get SEBI nod for IPO - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్‌ కొంతమేర నెమ్మదించింది. అయితే తిరిగి మరోసారి ఊపందుకోనుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం దోహదపడనుంది. నిధుల సమీకరణకు తాజాగా సెబీ నుంచి అనుమతి పొందిన కంపెనీల జాబితాలో ఏపీఐ హోల్డింగ్స్, వెల్‌నెస్‌ ఫరెవర్‌ మెడికేర్, సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ చేరాయి. కాగా.. మరోవైపు స్పెషాలిటీ మెరైన్‌ కెమికల్‌ తయారీ కంపెనీ ఆర్కియన్‌ కెమికల్స్‌ ఐపీవో ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ సాధించే యోచనలో ఉంది. వివరాలు చూద్దాం..

ఫార్మ్‌ఈజీ..
ఫార్మసీ ప్లాట్‌ఫామ్‌ ఫార్మ్‌ఈజీకి మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తద్వారా రూ. 6,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,929 కోట్లు రుణ చెల్లింపులు, వృద్ధి అవకాశాలకు రూ. 1,259 కోట్లు, కొనుగోళ్లు తదితర వ్యూహాలకు రూ. 1,500 కోట్లు చొప్పున వెచి్చంచనుంది.  

వెల్‌నెస్‌ మెడికేర్‌
అదార్‌ పూనావాలాకు పెట్టుబడులున్న వెల్‌నెస్‌ ఫరెవర్‌ మెడికేర్‌ ఐపీవో ద్వారా రూ. 1,600 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఓమ్నిచానల్‌ రిటైల్‌ ఫార్మసీ కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.60 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇటీవలే బోర్డులో కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకుంది.

సీఎంఆర్‌ గ్రీన్‌
మెటల్‌ రీసైక్లింగ్‌ కంపెనీ సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.34 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

ఐపీవోకు ఆర్కియన్‌ కెమ్‌
సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు
న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్‌ కెమికల్‌ తయారీ కంపెనీ ఆర్కియన్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.9 కోట్ల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలలో పిరమల్‌ గ్రూప్, బెయిన్‌ క్యాపిటల్‌ మధ్య ఏర్పాటైన భాగస్వామ్య సంస్థ రిసర్జెన్స్‌ ఫండ్‌ ప్రధానంగా వాటాను ఆఫర్‌ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన ఏడాది కంపెనీ దాదాపు రూ. 741 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement