
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని గృహోపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అంచనా వేస్తోంది. కరోనా తీవ్రత నేపథ్యంలో పనిమనుషులు ఇళ్లలోకి రాని పరిస్థితి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణ నేపథ్యం విక్రయాలను పెంచేందుకు తోడ్పడతాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ పరిశ్రమ (సీఈఏఎంఏ) విశ్లేషిస్తోంది. లాక్‌డౌన్ సడలింపుతో ఈ జూలైలో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వృద్ధిని సాధించగా, ఆగస్ట్ నుంచి గృహోపకరణాల విభాగపు విక్రయాల్లోనూ వృద్ధిని చూస్తున్నట్లు సీఈఏఎంఏ పేర్కొంది. ఆగస్ట్‌లో ఓనమ్ పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాలు అంచనాలను మించడంతో పరిశ్రమలో మరింత ఆశావహ వాతావరణం నెలకొంది.
అమ్మకాల వృద్ధి ఇందుకే...
వ్యవస్థలో నెలకొన్న డిమాండ్‌కు తగ్గట్లు పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలను అమలు పరుస్తున్నాయి. ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ప్రకటనలు, వారంట్‌లతో పాటు వాయిదాల పద్ధతి గడువు పెంపు, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ లాంటి పద్ధ్దతులను అనుసరిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాగే కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఈ తరహా పరికరాలకు డిమాండ్ భారీగా పెరిగింది.
వీటికే అధిక డిమాండ్...
కరోనాతో గృహ శ్రామిక శక్తి(పని మనుషుల) కొరత నెలకొనడంతో వాషింగ్ మెíషీన్, మైక్రోవేవ్, డిష్‌వాష్ బార్, రిఫ్రిజిరేటర్ లాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలకు అధిక డిమాండ్ నెలకొందని సీఈఏఎంఏ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కరోనా తో దాదాపు అందరూ ఇం టికే పరిమితం కావడంతో టీవీలు, హోమ్, పర్సనల్ ఆడియోలకు మంచి గిరాకీ నెలకొంది.
ఆందోళనలూ ఉన్నాయ్...
పరిశ్రమ ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ స్థానిక రిటైలర్లు, బ్రాండ్ల విషయంలో సీఈఏఎంఏ కొంత ఆందోళనను వ్యక్తం చేసింది. ద్రవ్య కొరత కారణంగా గత సీజన్లలో మాదిరి స్కీములు, ప్రమోషన్లు లాంటి కార్యక్రమాలను వారు నిర్వహించలేకపోవచ్చని చెప్పుకొచ్చింది. అలాగే ఫోన్లు, ల్యాప్æట్యాప్స్, టీవీ లాంటి పరికరాల్లో ఉత్పత్తి కొరత కారణంగా బ్రాండ్ల సమస్య
నెలకొని ఉంది.
కంపెనీల ఆశాభావం...
ఓనమ్‌తో పండుగ సీజన్ ప్రయాణాన్ని సానుకూలంగా ప్రారంభించామని, గతేడాదితో పోలిస్తే ఈ విభాగాల్లో అమ్మకాలు ఇప్పటికే 20 శాతం వృద్ధిని సాధించాయని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ తెలిపారు. పండుగ సీజన్ ముగిసేనాటికి 30శాతం అమ్మకాలను సాధిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఓనమ్ సందర్భంగా ప్యానసోనిక్ అమ్మకాలు కిందటేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని సాధించాయి. ఈ పండుగ సీజన్ విక్రయాల్లో 20శాతం వృద్ధిని సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ సైతం ఇదే కాలంలో 30శాతం అమ్మకాల వృద్ధిని ఆశిస్తోంది.