మంచిని వాడుకోవాలి, చెడు నుంచి సమాజాన్ని కాపాడుకోవాలి
భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ప్రపంచ ఎకానమీ వృద్ధికి, భౌగోళిక రాజకీయాలకు కృత్రిమ మేథ (ఏఐ) కీలక చోదకశక్తిగా ఉంటుందని భావిస్తున్నట్లు భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించుకోలేని కంపెనీలు, దేశాలు వెనుకబడిపోతాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కొత్త టెక్నాలజీలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి. దీనితో కొత్త సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి.
ఇది దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా ఉన్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి’’ అని చెప్పారాయన. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన తెలియజేస్తూ... ‘‘దుబాయ్‌లోని మా సీనియర్ ఫైనాన్షియల్ అధికారికి నా గొంతును అనుకరిస్తూ, భారీ మొత్తంలో నగదును ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ ఒక ఫేక్ కాల్ వెళ్లింది. ఆ అధికారి అప్రమత్తంగా వ్యవహరించి, ఫ్రాడ్‌ను వెంటనే గుర్తించడంతో ముప్పు తప్పింది.
ఆ వాయిస్ రికార్డింగ్ విన్నప్పుడు అది అచ్చం నా గొంతులాగే ఉండటం నన్ను ఆశ్చర్యపర్చింది‘ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందులోని మంచిని వాడుకోవాలని, చెడు కోణం వల్ల తలెత్తే దు్రష్పభావాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలని మిట్టల్ చెప్పారు. అయితే, మొత్తం మీద కృత్రిమ మేథతో ఒనగూరే ప్రయోజనాలపై తాను ఆశావహంగా ఉన్నట్లు ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.
వ్యాపారాలపరంగా చూస్తే రొటీన్‌గా, పునరావృతమయ్యే విధులను నిర్వర్తించే ఉద్యోగాల్లో ఏఐ వల్ల కోత ఉంటోందని, కానీ వాటికి సమానంగా కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయని మిట్టల్ వివరించారు. కాల్ సెంటర్లు, వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటిలో ఏఐతో గణనీయంగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. కృత్రిమ మేథ రాకతో కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలు రాగలవని, వాటి నుంచి కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు.
ఆదాయం పెరగాలి
దేశీయంగా టెలికం మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటే సగటున యూజర్లపై వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) ఇంకా పెరగాల్సి ఉంటుందని మిట్టల్ చెప్పారు. ఇటీవలి పెంపు తర్వాత 2.5 డాలర్ల స్థాయిలో స్థిరపడిన ఏఆర్‌పీయు 5 డాలర్లకు చేరాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, ఎడారులు, అడవులతో నిండిపోయిన 25 శాతం భూభాగంలో ఉంటున్న 5 శాతం జనాభాకు ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని మిట్టల్ చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక ’మ్యాజిక్ బులెట్’గా పనిచేస్తుందని పేర్కొన్నారు.
‘తయారీ’లో మరిన్ని ఆవిష్కరణలు రావాలి: భారత్ ఫోర్జ్ ఛైర్మన్ బాబా కల్యాణి
2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న నేపథ్యంలో గణనీయంగా వృద్ధి సాధించాలంటే తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలంటే నవకల్పనలు అత్యంత కీలకమని, నూతన సాంకేతికతలను స్థానికంగా అభివృద్ధి చేస్తే పరిశ్రమకు దన్నుగా ఉంటుందని పేర్కొన్నారు. ‘విదేశాల్లో తయారైన వాటిని కాపీ కొట్టడం కాకుండా మనం కూడా టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను రూపొందించాలి. ఇతర దేశాలు మన నుంచి కాపీ కొట్టేలా మన సొంత ఉత్పత్తులను తయారు చేయాలి‘ అని కల్యాణి చెప్పారు. ఏఐతో ఉత్పాదకత, సమర్ధత, ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడగలదన్నారు.
వైద్య విధానాల్లో వినూత్నత: అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డి
వైద్యానికి సంబంధించి ప్రస్తుత టెక్నాలజీలను మరింత మందికి చేరువ చేసేందుకు వైద్య విధానాల్లో వినూత్నమైన ఆవిష్కరణలు అవసరమని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డి చెప్పారు. విదేశీ అధ్యయనాలపై ఆధారపడకుండా దేశీయంగా ఫండమెంటల్ రీసెర్చ్ జరగాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ మెరుగుపడాలంటే పరిశోధనలపై గణనీయంగా వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక్క శాతం కన్నా తక్కువే వెచ్చిస్తున్నామని సునీత రెడ్డి తెలిపారు. మరోవైపు, పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే సంచలనాత్మక మార్పులు కీలకమని డీసీఎం శ్రీరామ్ సీఎండీ అజయ్ శ్రీరామ్ చెప్పారు. జనధన యోజన, ఆధార్, మొబైల్ (జామ్ ట్రినిటీ) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రైతులతో కనెక్టివిటీ మెరుగుపడేందుకు గణనీయంగా తోడ్పడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ ముడిపదార్థాలు, పనిముట్లు రైతులకు అందుబాటులోకి ఉండేందుకు ఈ–కామర్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment